Wednesday, May 17, 2017

న్యస్తాక్షరి - ప్ర భా త ము.


న్యస్తాక్షరి.ప్ర  భా త ము.

తే.గీ:ప్రకృతి కాంతయు మరియుచు పరవశింప
     భానుడుదయవేళలందు ప్రభలు చూప
      తమ్మిపూవులు కొలనులో దరహసింప
    ముచ్చటగ గాంచిరా సౌరు ముదితలెల్ల.

2.తే.గీ:ప్రథమ పూజలిడ దలచి ప్రణతు లిడుచు
          భాస్కరుని చెంత విప్రులు భాసురముగ
         తడయక ర్ఘ్యము లనిడగ తమిని జూప
      ముదితలు సహకరింపగ మురిసిరెల్ల.

3..తే.గీ: ప్రకటితమవగ నరుణుడు ప్రభలు చూపి
          భాను డేతెంచె గగనాన ప్రాచి దిశను
            తమమ తొలగించిముదమిడ ధరణికాంత
           మురిసి స్వాగతము పలికె మోహనముగ.

4.తే.గీ:ప్రణతు లిడగ వేచిరచట బ్రహ్మవిదులు
        భానుకేసరు రాకకై వార్ధి చెంత
         తరుణమరసి యంబరమున తరణి రాగ
          ముకుళితకరకమలముల మ్రొక్కి రచట.

5.తే.గీ :ప్రకృతి కాంత ప్రాచీ దిశన్ వలపుతోడ
        భానుమంతుని చూచుచు పలవరించి
        తమకమునుచూపుచు నచట త్వరితగతిని
       ముగ్ధవోలె తానరుదెంచ మురిసె రవియు.

6.తే.గీ:ప్రభలు చిలుకుచు గగనాన భాసురముగ
          భానుడేతెంచె గనుడట ప్రజలార
          తమము తొలగ వెలుతురులో ధైర్యమూని
           మురిసి తామరలు విరిసె ముదము తోడ

7.తే.గీ:ప్రగతి పథమున సాగంగ ప్రతిదినమ్ము
          భాసురముగ నిను గొలువ ప్రజలు నెల్ల
          తహతహను బూని వత్తురు ధరణియందు
           ముజ్జగములకు వెలుగిడ ముందు రార.








Monday, May 15, 2017

పరనింద


అంశము:పరనింద

ఆ.వె:పరుల నింద చేయ పాపములంటును
      పరులు నిన్ను దిట్ట పాపమణగు
      పరుల నింద చేసి పాపమార్జించుట
      కన్న నింద చేయకున్న మేలు.

ఆ.వె:నింద చేయ బోకు నీతోటి వారిని
       పాఫ ఫలము నంద వలసి యుండు
    నఘము కలుగు పనుల నాచరింపక యున్న
     జగతి యందు నీకు శాంతి కలుగు.

ఆ.వె:సతము పరుల నింద సలుప నంటు నఘము
      నింద లొంద తొలగు నిజమటండ్రు
      పరుల నింద విడువ బ్రతుకు ధన్యంబౌన
      టంచు నరయు మయ్య నవని యందు.

కం:పరనిందచేయ పాపము
   ధరలో వెంటనె జనులకు తగులును కనుకన్
     పరులచె నిందింప బడక
    పరులను నిందింప కున్న పాపము లణగున్.

కం:పరుల నెపుడు నిందించకు
    యొరుల దురితములు నంటును నుర్విలొ నీకున్
      పరనింద చేసి యఘముల
  మరిపొందక యున్న శాంతి మనసుకు కలుగున్

నల్లధనము


అంశం:  నల్లధనము
                                          డా.బల్లూరి ఉమాదేవి
                                             కామవరం,ఆదోని.

1.ఆ.వె:స్వార్జితంబు నైన సంపద సుఖమిచ్చు
     తనది కాని దేది తరము కాదు
     పైన నొకడు చూచు భగవంతు డుండును
      నల్లధనము నమ్మి నష్టపోకు.

2ఆ.వె:వేతనమునకింత విలువకట్టిన పన్ను
         కట్టవలెను జనులు క్రమముగాను
          కాసుకాశ పడిన కష్టముల్ దప్పవు
         పట్టుబడిన తాను బంది యగును.

3.ఆ.వె:న్యాయరీతి లోన నార్జించిన ధనము
         తృప్తి నొసగుచుండు సృష్టి యందు
         కాదు కూడదనుచు కాపాడ జూచిన
        నల్లధనమె బ్రతుకు నల్ల బరచు

4.ఆ.వె:అక్రమమ్ము గాను నార్జించు ధనమును
        నల్లధనమటంచు నందు రిలను
         దొరకనంత వరకు దొరలు తామౌదురు
         దొరక గానె వారి పరువు పోవు.

5.ఆ.వె:నల్లధనమువెలికి నయముగా రప్పింప
           యుక్తిపన్నెగాదెయుర్వి లోన
           ముఖ్యసచివు డొకడు మొదట కష్టమె యైన
            పిదప మేలు కలుగుభీతి వలదు.
          
6.ఆ.వె:నీతితోడనున్న నెమ్మదిచెడబోదు
          పన్ను కట్టకున్నబాధ పెరుగు
         అట్టి వారి కిలను నగచాట్లు హెచ్చౌను
       తెలుసుకొనుముబిడ్డతెలివికలిగి

7.ఆ.వె:ఒక్కనోటుమార్చ నుర్విమారగ బోదు
            దొంగ నోట్లుదాచు దొరల కిపుడు
         నుయ్యి ముందు వెనకగొయ్యి చందంబ య్యె
        అడుసుతొక్కనేల యడలనేల.

8.ఆ.వె:ఉగ్ర వాదమణచనుర్విలో యత్నించి
           ధనమె మూలమంచు దారి తప్పు
           ధనము నిటుల మంచి దారినిడగ నెంచి
           పెద్ద నోట్లు'మోడి'రద్దుచేసె.

9.ఆ.వె:ఆది లోనకలుగు నన్నియాటంకముల్
           సర్దు కొనును వేగ జగతి యందు
      యో( ఓ)రి మున్న చాలు  నొనగూరు సుఖమలు
         ననెడు మాట లెపుడునమ్మవయ్య.

10.ఆ.వె:నల్ల ధనమటన్న నల్లని పామేను
            కాటు వేయు నదియుకడకు నిన్ను
             పన్ను కట్ట నీకు పైకంబు మిగులును
              దాచు కొన్నదెల్ల దోచ బడును.

11.ఆ.వె:లంచములను మ్రింగి లక్ష్మిపుత్రుడ నంచు
             చెప్పుకోకు మయ్య చేటు కలుగు
                 యిచ్చుట యును మరియు పుచ్చుకొనుటకూడ
                    నేరమనెడి మాట నెరుగవయ్య.

12.ఆ.వె:అక్రమముగ ధనము నవనిలో నార్జించి
              దాచి యుంచ నదియు తప్పె యగును
                పరుల కొంప కూల్చి పైకంబు దాచంగ
                చివర చేతి కెపుడు చిప్ప మిగులు.

13.ఆ.వె:సక్రమముగ ధనము సంపాదించితి వేని
                తరతరములవరకు ధరను మిగులు
                అక్రమముగ వచ్చు నార్జనమ్మంతయు
                   పట్టు బడగ బోవు వసుధ యందు.

14.ఆ.వె:ధనమె మూలమంచు దయమాలి కొందరు
               లంచములను కోరి కొంచమైన
               జాలి లేక జనుల జగతిలో పీడింప
               నదియె  గనుమునిలనునల్ల ధనము.

15.ఆ.వె:గొప్ప నిర్ణయమ్ము ఘనముగా చేపట్టి
            మార్గదర్శకుడయ్యె మహిని మోడి
             కొత్తనోట్లు తెచ్చి చిత్తు చేసెను గదా
             నీతిలేనివారి నిలను తాను.

16.ఆ.వె:దిగులు పడగ వలదు జగతిలో జనులార
              సగటు జీవులకును సంతసమ్ము
               కలుగువార్త నిదియుకలవరము వలదు
                 నల్లధనమనునదితెల్లనగును.

17.ఆ.వె:నల్లధనమ దెెపుడు నాణ్యమైనది కాదు
              న్యాయము విడనాడి  యార్జనమ్ము
               చేయ తొలగు సుఖము చిత్త మశాంతమై
                మిగులు సతము నీకు దిగులు గనుము.

18.ఆ.వె:కట్టె పెట్టె లందు గుట్టుగా దాచిన
               పైకమెల్ల నేడు పనికి రాక
               తికమకపడుచుండి తిట్టుచు నేతలన్
                ఖర్చు చేయ లేక కస్తి పడిరి.

19.ఆ.వె:పెట్టె లందు యున్న పెద్దనోట్లన్నియు
              పెద్ద పాములల్లె భీతి గొలుప
               గుట్టు రట్టు కాగ గుండెగుభిలనంగ
                నేమి చేయ వలెనొ నెరుగ రైరి.

20.ఆ.వె:బీరువాలయందు పెద్ద పెట్టెల యందు
              వంట యింటిలోన వాసిగాను
              మంచమరల యందు మంచిగా దాచిన
              సొమ్ము వ్యర్థమనగ సోలిరెల్ల.

21.ఆ.వె:పెద్ద నోట్లనెల్ల పెట్టెలలో దాచి
             భరత జాతి యొక్క పరువు తీసి
              పరుల పేరు లందు పైకమ్ము దాచిన
               మోసగాళ్ళకిపుడు మూర్ఛ వచ్చె.

22.ఆ.వె:పేద ప్రజల దోచి పెట్టెలు నింపుచూ
               ముందు జాగ్రతనుచు మోహ మంద
               కలము పోటు తోడ కంగారు పెట్టుచు
                 ఘనుడు నయ్యె మోడి కనగ రండు.

23.ఆ.వె:దార్శనికత తోడ ధరణిలో యీనేత
               నల్లధనము నెల్ల తెల్ల చేయ
               నోట్లు రద్దు చేసి గుట్టురట్టునుచేసె
                 నూత మొసగ రండు నుత్సుకతన.

24.ఆ.వె:స్వచ్ఛభారతమ్ముసాధింప                          సమకట్టిగొప్పనిర్ణయమ్మ   కువలయాన
                తీసుకొనియె నితడుదేశమ్ము నికపైన
                బలముపుంజు కొనుచుబాగు పడును.



                
                  

Sunday, May 14, 2017

అమ్మ.

మాతృ మూర్తులందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు.

అంశం:అమ్మ.
          
అమ్మ.

1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ

     తరమె యేరి కైన దలచి చూడ

      ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి

        భాగ్యశాలి నంచు పరవశించు..

2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా

          కడుపు చూసి నింపు కరుణ తోడ

          సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను

         అమ్మ ప్రేమ కిలను నంత మేది.

3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు

            సాటిలేని యట్టి మేటి మమత

              నంద చేయు శక్తి యమ్మదే మహిలోన

            తల్లికన్న నెవరు దైవ మిలను.

4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి

            జన్మ మొసగు నట్టి జనని యెపుడు

             దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా

            దైవతములకెల్ల దైవమామె.

5.కం:అమ్మను మించిన దైవము

         నిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే

          కమ్మగ బిడ్డలు తల్లిని

         నమ్మా యని పిలువగనట హాయిని బొందున్

6.ఆ.వె:ఆస్తులెన్ని యున్న నభిమానమే లేక

        అమ్మ ప్రేమ మరువ నధముడగును

       అట్టి వానిపైన నాదరణను జూపు

        నమ్మకన్న దైవ మవనినెవరు.

7.ఆ.వె:కన్నతల్లి యెపుడు కడుపు జూచుచు నుండు

       కంట నీరు జూడ కలత పడును

       అమ్మ మనసె పెద్దయంబుధి ధరలోన

       మరువ బోకు నీవు మాతృ ప్రేమ.

       తల్లికన్న నెవరు దైవ మిలను.

8ఆ.వె:కాళ్ళు బార జాపి కన్నొత్తి చెక్కొత్తి

          లాల పోసి తుడిచి లాలి పాడి

         నిదుర బుచ్చి నుదుట నిలువు బొట్టునుపెట్జి

       కనుచు మురిసి పోవు కన్న తల్లి.

9.ఆ.వె:తాను తినక సతము తనయులకని దాచు

      నమ్మ ప్రేమ కెపుడు నంతు లేదు

      మమత తోడ పంచు మాధుర్యమును బొంది

     మరువ పాడి గాదు మహిని నిజము.

10.ఆ.వె:అమ్మవంటి దైవ మవనిలో కనరాదు

            తండ్రి కోప గించ తాను కాచు

             అడ్డదారి చనిన బిడ్డను గాపాడ

            మ్రొక్కు లిడుచు తాను ముడుపు గట్టు.

11.ఆ.వె:అమ్మ మాట విన్న నన్నిభాగ్యములబ్బు

          అమ్మ దీవె నున్న నన్ని దొరకు

           అమ్మనవ్వు లోన నమృతమ్ము చిందురా

          అమ్మప్రేమ తోడ నాడు కోకు.

12.ఆ.వె:అమ్మ యలుక బూన నాదిశక్తియె యౌను

         ఆకలన్నవారి కన్న పూర్ణ

      తాటియాకు మంట తల్లి కోపమ్మురా

          అంతలోనె నదియు నారి పోవు.

13.ఆ.వె:చదువు లెల్ల నేర్చి సంస్కారయుతుడైన

       మురిసిపోవు గాదె ముసలి తల్లి

       కొడుకు ప్రేమ ముందు కోటిరూప్యములైన

          సమము కానె కావు జగతి యందు.     

14.ఆ.వె:అడక కుండ దీర్చు నవసరమ్ములు నన్ని

          ఆకలెరిగి తాను నన్నమిడును

   విసుగు యన్న మాట యిసుమంతయును లేక

 యంత్రమల్లె చేయు నన్ని పనులు .

15.ఆ.వె:తనయులున్నతిగని ధన్యత నొందితి

      నంచు మురియు నమ్మ యవని యందు

     ముప్పు నందు గనుము ముదముతో తల్లిని

      యేమి కోర బోదు  యిలను తాను.

Thursday, March 9, 2017

నేను



నేను 
అమ్మా నాన్నల ప్రతిరూపాన్ని
ఆడపిల్లను నేనాడపిల్లను
అమ్మ వేలు పట్టుకు నడిచిన పాపాయిని
బడికి వెళ్ళాలన్నా అన్ననో తమ్ముడినో
సాయంగా తీసుకెళ్ళే  అమ్మాయిని
చదువు పూర్తికాగానే ఇష్టాయిష్టాలతో 
పనిలేక నాన్నమాటవిని తాళికట్టించుకొన్న యువతిని
పాతికేళ్ళకే పిల్లలను కని పెంచే మరలాంటి
మహిళను
యంత్రాలకైనా విశ్రాంతుంటుందేమో కాని
అదికూడాలేని ఆడదాన్ని
రెండుచేతులా సంపాదిస్తున్నా
నాకంటూ ఏమీ మిగుల్చుకోలేనిదాన్ని
మధ్యతరగతి మహిళను 
కాలం మారినా మనుజులు మారినా
ఆడదంటె అబలలంటు పరాచికాలాడినా
కాదని గట్టిగా అనలేని మహిళను
మొండికేసి తిరగబడితె
 ముల్లు మీద బడ్డ అరిటాకు చందమే
అందుకే 
నొప్పింపక ఒప్పిస్తూ బతుకుతున్న మహిళను
నాకు నేనే బలం నాఆత్మబలమె ఆయుధం.


Sent in ప్రయుత కవితాయజ్ఞం

Monday, February 27, 2017

అక్షరమాల


                   అక్షరమాల 

                              డా.బల్లూరి ఉమాదేవి 
                                  
1.ఆ.వె:శారదమ్మ నిన్ను సద్భక్తితో గొల్తు 
            మంచివాక్కు లొసగు మమ్మ మాకు 
            పదుగురెదుట నిలిచి ప్రతిభఁకనపరచు 
              శక్తి నొసగవమ్మ చదువులమ్మ. 

2.ఆవె:"అ"మ్మభాషనేర్చి నందరినలరించు   
         "ఆ"టపాటలందు మేటి వౌచు 
          "ఇ"ంటిలోనె కాక యిలలోనయంతట 
         "ఈ"శు దయను బొందు మీసులేక 

3.ఆ.వె:"ఉర్విలోనజనులు యూరించుచున్నను 
             "ఊ"డిగమును వీడి యురక బోకు 
              "ఋ"షుల వాక్కులెపుడురిత్తవొవని యెంచు 
             వారి దీవనములె వరములౌను 

4.ఆవె:"ఎ"వ్వరేమియన్న యెదురాడబోకుమా 
           "ఏ"ది జరుగు చున్న నదియె మంచి 
            "ఐ"దుభూతములును యవసరమ్మే కదా 
             "ఒ"ద్దికగ తెలిసిన యూరు మెచ్చు. 

5.ఆ.వె:"ఓ"ర్పు తోడ పనులు యుర్విలో సాధ్యమౌ 
            "ఔ"దలధరియించు మార్యు వాక్కు 
            "అం"దరి యెడ జూపుమాత్మీయతను నీవు 
             "అహ"ము వీడి బతుక హాయికలుగు 

6."క"లహ మెపుడుమంచి కాదని యెరుగుమా 
    "ఖ"చిత మైన మాటె కలను పలుకు 
      "గ"రిమ గలిగె నేని ఘనతను పొందుచూ 
     "ఘ"నుడవౌదు వీవు  కల్లకాదు/కటికనిజము 

7.ఆవె:"చ"దువుకొన్నయెడల సంస్కార మబ్బును 
          "ఛ"వియు హెచ్చు చుండు సంఘమందు 
          "జ"యము గల్గు గాదె జగతిన జనులకు 
          "ఝ"షమువోలెనుండుజలము నందు 

8.ఆ.వె: "ట"క్కుచేయబోకు చిక్కునపడెదవు 
           "ఠ"క్కు విద్య లెల్ల ఠావు దెచ్చు 
            "డ"స్సిపోదువీవు డాబుసరికిపోవ 
           "ఢ "క్కి మొక్కి తినుచు  లాభ మెంచు 

9.ఆ.వె:"త"ప్పుచేయ బోకు ధర్మమున్వీడకు 
.          "థ"రము కాని పనుల కరము నిడకు 
            "ధ"నమె మూలమనుచు దారితప్పగ బోకు 
          "న"యము తోడహరిని నమ్ముకొనుము. 

10.ఆ.వె: "ప"ట్టుదలయు యున్న "ఫ"లవంత మగునన్ని 
           "బ"తుకు బండి లాగ బలము వలయు 
            "భ"యము భక్తి తోడ బాధ్యతల్ మోయంగ 
           "మ"హినికలుగు చుండు మంచి యెపుడు 
             
12.ఆ.వె:"య"మునితోడపోరి యతివ తాగెలుపొందె 
            "ర"హినిబొందుచుండె రమణు చేరి 
            "ల"భ్యమయ్యె రాజ్యలక్ష్మి తనపతికి 
             "వ"లపుహెచ్చి తీపి బతుకు గడిపె. 

13.ఆ.వె:"శ"రణు యన్న చాలుశరణమొసగు చుండు 
          "ష"ణ్ముఖుండు చూపు సంతసంబు 
         "శ"మము గల్గి యున్న సౌఖ్యమబ్బునుగదా 
          "హ"ర్ష చిత్తుడైన యాశ దీరు 

14.ఆవె:అక్షరములు నేర్చియార్జించు జ్ఞానమున్ 
             మంచి కొలువునంది మన్ననొందు 
             మహిత వైభవమున మహిలోన జనములు 
           సాధుసాధు యనుచు సన్నుతింత్రు. 

15.ఆ.వె:విద్యనేర్చుకొన్న విజ్ఞాన సంపదన్ 
           పొందగలవు నీవు పుడమి యందు 
           దాన ఖ్యాతిగలుగు ధనసంపదలబ్బు 
          నేర్పుతోడ విద్య నేర్వ వయ్య 

16.ఆ.వె:అమ్మయొడియె నీకు అక్షరాలను నేర్పు 
           కుక్షి నింపు విద్య గురువు నేర్పు 
            విద్య లెల్లనేర్చి వేగుచుక్కవగుచు 
            విజయమందు వయ్య వీర పుత్ర./వినయశీలి. 

17.ఆ.వె : అమ్మ భాషలోన కమ్మగా భాషించ 
             తెలుగుతల్లి మెచ్చిదీవె నొసగు 
             తెలుగుభాష నేర్చిదేశదేశములందు 
             మహిత కీర్తిగనుము మంచిగాను. 

18.ఆ.వె:చదువుకొన్న యెడల పదవులు దొరకును 
          పదవి దొరక బ్రతుకు బాగు పడును 
         విద్యలెల్ల నేర్చి విజయము సాధించ 
         కన్నవారి కదియె కలిమి సుమ్మి. 

19.ఆ.వె:విద్యనేర్చితి నంచు విర్రవీగకుమయ్య 
           ఎదుగు చున్న కొలది నొదిగి యుండు 
           దాని వలన కలుగు ధరలోన మాన్యత 
         తెలిసి మసలుకొనుము తెలివి తోడ. 

20.ఆ.వె :తెలుగుభాష లోని తీయందనము నెల్ల 
           పూర్వకవులు వ్రాసి పొగడినారు 
           వారి బాట నడచి వాసిగా పేరొంద 
            కీర్తి కల్గు ప్రజకు స్ఫూర్తి కల్గు. 

21.ఆ.వె :ఆంధ్రభారతమ్ము నాదికవియు వ్రాయ 
            తిక్కనాదు లెల్ల తీర్చి దిద్ద 
            తెలుగు మాత కొత్త మలుపులుతిరుగుచు 
            సాగు చున్న దదిగొ జగతి యందు. 

22.ఆ.వె :ఆటుపోట్ల కెపుడు నదరబోదీ భాష 
           వన్నె తగ్గ బోదు వాసి హెచ్చు 
          "దేశభాష లందు తెలుగు లెస్స"యనుచు 
           కృష్ణవిభుడు నాడె కీర్తి పెంచె. 

23.ఆ.వె:తెలుగు భాష నెవరు తేలిక చేసినా 
           నూరకుండ బోకు నుర్వి యందు 
           తెలుగు వాడినంచు దీటుగా స్పందించు 
          తెలుగు వాడి వేడి తెట పరచు. 

24.ఆ.వె:చదువు సంధ్య నేర్చి సంస్కార వంతుడై 
          బ్రతుకు గడుప మెచ్చు భరతమాత 
         దేశ ఋణము దీర్చు దీక్షను చేపట్ట 
         జనులు మెత్తు రయ్య జగతి యందు. 

25.ఆ.వె: తెలుగు భాష లోని తియ్యందనమ్మును 
       నెల్ల వారలకును నిడుట కొరకు 
       తరలి రండు తమరు తడవును సేయక 
      గోవు పాల వోలె గ్రోల గాను/వచ్చు.

Friday, February 24, 2017

శివస్తుతి.


అంశం:   శివస్తుతి.

ఆ.వె:నాగభూషణుడవు నగజాత పతివీవు
        భక్త వత్సలుడవు ఫాలనేత్ర
        మాదు మొరలు వినుచు మమ్మాదరింపుమా
       హరహర మహదేవ హర్ష మొసగు.

ఆ.వె:కోరి త్రాగినావు గొడగూచి యొసగిన
        కమ్మ నైన పాలు గరళకంఠ
        భక్తసులభుడవట పాపాలు హరియించి
        మమ్ము బ్రోవుమయ్య మారవైరి.

ఆ.వె:పాశుపతము కోరె పాండుసుతుడు నాడు
         తపము చేయుచుండ ధరణి యందు
        వేటగాని వలెను వెలది గిరిజ తోడ
         వచ్చి చేసితీవు బవరమచట.

ఆ.వె:నీకు మనువు గూర్చ నెమ్మితోనేతెంచె
         మన్మథుండుతాను మహిని నాడు
         నాగ్రహమ్ము తోడ నగ్ని నేత్రము దీయ
        కాలి బూడిదయ్యె కంతు డపుడె.

ఆ.వె:పాలసాగరమున ప్రభవించిన యట్టి      
         విషము మ్రింగితీవు వెరపులేక
         నీదు శక్తి నెరిగి నెమ్మితో డను మ్రింగు
       మనియె శైలపుత్రి యవని యందు.

ఆ.వె:తిన్నడనెడివాడు తిరుగు నొంటిగ
          గాంచె లింగ మచట కానలోన
         నీలకంఠు కంట నెత్తురు గారంగ
         కన్నులొసగ నెంచ కాచితీవు.

ఆ.వె:నంది వాహనుడవు నటరాజ మూర్తివి
         చంద్రమౌళివీవు జయము నొసగు
        నగజకు పతివీవు నామొరలాలించి
         యాదరించవయ్య యసమనేత్ర.

ఆ.వె:సగము మేనొసంగె నగజాతకీతడు
          భోళ శంకరుండు భువిని నిజము
           వేడుకొనెడి జనుల విడువడేక్షణము,కు
          మార జనకు డితడె మార వైరి
           
ఆ.వె:కోరికొలుచు వారి కొంగు బంగారమై
         కూర్మి తోడ దీర్చు కోర్కొలెల్ల
          సురనదిపతియితడె శూలపాణియితండె
           భస్మధారి యితడె పరమ శివుడు.

ఆ.వె:హరహరమహదేవ యనుచు ననవరతము
          నిన్ను చేరి కొలుతు నీలకంఠ
          మామొరాలకించి మమ్మేలు మనిశము
          వేడు కొందుమయ్య విశ్వనాథ.