Sunday, August 6, 2017

స్నేహితులు

మిత్రులందరికీ శుభోదయం

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

అంశం:స్నేహితులు

ఆ.వె:ఉండ వలయు భువిని నుత్తమ మిత్రుండు
        భార్య తోడ కూడ పంచ లేని
          విషయములను  తాను విశదముగ దెలిపి
             బడయగలడు శాంతి బ్రతుకు నందు.

ఆ.వె:ఇలను మిత్రు డెపుడు హితము గోరుచు నుండు
             నార్థికముగ తాను నాదుకొనుచు
            లేమి వేళలందు లేదనక ధనము
           నొసగి పంపు చుండు నుత్తముండు.

ఆ.వె:పిడికెడటుకులొసగి పెన్నిధి తానందె
         ననెడి కథను విందు మవని యందు
         నట్టి మిత్రు లెపుడు నాదుకొనుచునుండ
           శాంతి సుఖము కల్గు జనుల కెల్ల.

ఆ.వె:అన్ని వేళలందు నాత్మీయతను పంచు
         మిత్రుడొక్కడున్న మిసిమి యదియె
         ముదము నంద వచ్చు పుడమిలో సతతము
            కల్లకాదు నిదియె కటిక నిజము.

.ఆ.వె:కష్ట సుఖములందు కాపాడు మిత్రుండు
         నొక్క డైన చాలు నుర్వి యందు
         పంచుకొనుచునుండబాధ లెల్ల తొలగు
          మనసు తేలికగును మమత హెచ్చు.

.ఆ.వె:సృష్టిలోన జూడ తృప్తిని కల్గించు
          స్నేహబంధ మొకటె సేమ మొసగు
          నాప్తబంధువగుచు నన్నియు సమకూర్చు 
            నట్టి సఖుడు వలయు నవని యందు.

మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

"ము"ఖ పరిచయం లేకపోయిన ము
"ఖ"పుస్తక మిత్రులతో చెలిమిని చేస్తూ వారి
"పు"రోగతి నాకాంక్షిస్తూ .. వేకువజాము నుండి మ
"స్త"కాలకు పని పెడుతూ,చేతి వేళ్ళనే
"క"లములుగా చేసుకొని వానికి పనికల్పించి
"మి"హిరుడు రాకముందే మేల్కొని మి
"త్రు"లకు శుభోదయం పల్కుతూ శ్రీ
"ల"క్ష్మీ పతి అనుగ్రహం కోరుతూ ఒకే
"కు"టుంబంలా కలసి మెలసి వున్న
"స్నే"హితులకు
"హి"తులకూ
"తు"ష్టిని పుష్టిని యొసగుమని
"ల"క్ష్మీకాంతుని ప్రార్థిస్తూ  ఈ సత్స్నేహం
"దినదిన ప్రవర్దమానంకావాలనీ మ
"నో"ల్లాసం అందరికి కలగాలని నిత్యో
"త్స"వం కావాలని జీవితంలో సతతము నవ
"వ"సంతం వెల్లి విరియాలనీ సకల
"శు"భఫలాలు పొందాలని ఎల్లప్పుడూ
"భా"షామతల్లిని కొలుస్తూ వుండాలని
"కాం"క్షిస్తూ ఆహరహం క్షరంకాని అ
"క్ష"రాలతో మన స్నేహ పరీమళా
"లు"దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

మొదటి అక్షరాలను గమనించండి.

Wednesday, August 2, 2017

అమ్మ

డా.బల్లూరి ఉమాదేవి
అంశం:అమ్మ.
         


  అమ్మ.

1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ

    తరమె యేరి కైన దలచి చూడ

     ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి

       భాగ్యశాలి నంచు పరవశించు..


2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా

         కడుపు చూసి నింపు కరుణ తోడ

         సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను

        అమ్మ ప్రేమ కిలను నంత మేది.


3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు

           సాటిలేని యట్టి మేటి మమత

             నంద చేయు శక్తి యమ్మదే మహిలోన

           తల్లికన్న నెవరు దైవ మిలను.


4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి

           జన్మ మొసగు నట్టి జనని యెపుడు

            దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా

           దైవతములకెల్ల దైవమామె.


5.కం:అమ్మను మించిన దైవ

        మ్మిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే

         కమ్మగ బిడ్డలు తల్లిని

        నమ్మా యని పిలువగనె హాయిని బొందున్



6.ఆ.వె:ఆస్తులెన్ని యున్న నభిమానమే లేక

       అమ్మ ప్రేమ మరువ నధముడగును

      అట్టి వానిపైన నాదరణను జూపు

       నమ్మకన్న దైవ మవనినెవరు.


7.ఆ.వె:కన్నతల్లి యెపుడు కడుపు జూచుచు నుండు

      కంట నీరు జూడ కలత పడును

      అమ్మ మనసె పెద్దయంబుధి ధరలోన

      మరువ బోకు నీవు మాతృ ప్రేమ.

      తల్లికన్న నెవరు దైవ మిలను.


8ఆ.వె:కాళ్ళు బార జాపి కన్నొత్తి చెక్కొత్తి

         లాల పోసి తుడిచి లాలి పాడి

        నిదుర బుచ్చి నుదుట నిలువు బొట్టునుపెట్జి

      కనుచు మురిసి పోవు కన్న తల్లి.


9.ఆ.వె:తాను తినక సతము తనయులకని దాచు

     నమ్మ ప్రేమ కెపుడు నంతు లేదు

     మమత తోడ పంచు మాధుర్యమును బొంది

    మరువ పాడి గాదు మహిని నిజము.


10.ఆ.వె:అమ్మవంటి దైవ మవనిలో కనరాదు

           తండ్రి కోప గించ తాను కాచు

            అడ్డదారి చనిన బిడ్డను గాపాడ

           మ్రొక్కు లిడుచు తాను ముడుపు గట్టు.


11.ఆ.వె:అమ్మ మాట విన్న నన్నిభాగ్యములబ్బు

         అమ్మ దీవె నున్న నన్ని దొరకు

          అమ్మనవ్వు లోన నమృతమ్ము చిందురా

         అమ్మప్రేమ తోడ నాడు కోకు.


12.ఆ.వె:అమ్మ యలుక బూన నాదిశక్తియె యౌను

        ఆకలన్నవారి కన్న పూర్ణ

     తాటియాకు మంట తల్లి కోపమ్మురా

         అంతలోనె నదియు నారి పోవు.


13.ఆ.వె:చదువు లెల్ల నేర్చి సంస్కారయుతుడైన

      మురిసిపోవు గాదె ముసలి తల్లి

      కొడుకు ప్రేమ ముందు కోటిరూప్యములైన

         సమము కానె కావు జగతి యందు.     


14.ఆ.వె:అడక కుండ దీర్చు నవసరమ్ములు నన్ని

         ఆకలెరిగి తాను నన్నమిడును

  విసుగు యన్న మాట యిసుమంతయును లేక


యంత్రమల్లె చేయు నన్ని పనులు .


15.ఆ.వె:తనయులున్నతిగని ధన్యత నొందితి

     నంచు మురియు నమ్మ యవని యందు

    ముప్పు నందు గనుము ముదముతో తల్లిని

     యేమి కోర బోదు  యిలను తాను.

నాన్న పై వ్రాసిన పద్యములను పంపుచున్నాను పరిశీలించగలరు.
ధన్యవాదములండీ


నాన్న:

ఆ.వె:జన్మ నిచ్చు తండ్రి జగతిలో దైవమే

        కమ్మనైన మంచి కథలు చెప్పు

       నాన్న చెంత నున్న నాకమదియు గాదె

      అతని కన్న మిన్న నవని నెవరు?


ఆ.వె:జన్మకారకుడతడు సన్మిత్రు డౌతాను

         మమతచూపుచుండు మహిని  తాను

        అమ్మ కోప పడగ నక్కున చేర్చుకు

          నాదరించు నతడు నాదరించు.


ఆ వె:కన్న సంతు కొరకు కష్టాలు పడితాను

      కూడబెట్టుచుండు కువలయాన

      తనకు లేని విద్య తనయులకు వలెన

      టంచుతపన చెందు నహరహమ్ము.


ఆ.వె:తనయు నున్నతిగని ధన్యుడైతిననుచు

        మురిసిపోవు తండ్రి ముదము తోడ

        ముసలి వాడటంచు ముప్పునందు విడక

        కంటిరెప్పవోలె కావుమయ్య.


ఆ.వె:తప్పు చేయ కొడుకు దండించుచుండును

       బాధ కల్గినపుడు సేద తీర్చు

      సఖుడు తానె యౌను సంకటములొదవ

     దైవమన్న తండ్రె ధరణి యందు.


Wednesday, July 12, 2017

పెద్దనోట్లరద్దు

పెద్దనోట్లరద్దు పెనుశోకమును మిగిల్చె
పెద్దవారి అండదండలతో కొందరి
పైకమెల్ల భద్రమయ్యె ముందు జాగ్రత్తగా
సామాన్యులెల్లరు సొమ్ముండి పేదలై
కష్టాలపాలైరి కువలయాన
ముందుచూపుతోడ ప్రభుత చేసిన కార్య
మరసిన నల్లకుబేరులు మందిపేర్లమీద
ధనము జమను చేసి తెల్లకుబేరులైరి నిజము
ఇంటి ఖర్చులకనుచు దాచుకొనిన ధనము
నిరుపయోగమనుచు నెరిగి నెరిగి
మార్చుకొనగ శ్రమను పడగవలసె
నోట్లరద్దువల్ల నాగె వివాహాలు
కొనుగోళెల్ల నిలిచిపోయె
వున్నవాడు మరింత వున్నవాడయ్యె
సగటుమనిషు వుండి లేనివాడయ్యె
రైతన్నలకెల్ల చిల్లర కష్టాలు చుట్టుముట్టె
కూలివారికొసగ చిల్లర కొరతాయె
అన్నదాతలగోడు నరణ్యరోదనమయ్యె
అందుకే మరల ఇప్పుడు పెద్దనోట్లు రద్దు
చేయ నెంచసత్ఫలితంబు రావచ్చు
"పిచ్చితుగ్లక"నుచు గేలిచేసిన కాని
కొత్తనోట్ల నిపుడు రద్దుచేయ
నల్లధనమదెల్ల వెలికి వచ్చు
విజయమందవచ్చు మోడి విశ్వమందు
శుభములకైనను నశుభాలకైనను
వలయుగాదె ధనము నెల్లవారికిని
సొమ్ములేక పనులు జరుగు టెట్లను
తలపు శూన్యమయ్యె నేతలందు
మంత్రదండమున్న మాయచేసియైన
మామూలు స్థిగతులు తెమ్ము వేగ



Wednesday, June 28, 2017

శుభోదయం

మిత్రులందరికి శుభోదయం.
పద్యాల సవ్వడి

అంశం:బాలకార్మికులు

ఆ.వె:పొట్ట కూటి కొరకు పుడమిలో పిల్లలు
         పసి వయసున పొలము పనులు చేయ
          పట్టణముల వైపు వలసవెళ్ళుచు నుంద్రు
         వారి నటుల జూడ బాధ కలుగు.

ఆ.వె:పలక బలపములను వాసిగా నిడుకొని
           బడికి వెళ్ళు వయసు బాల లెల్ల
            శనగ తోట లందు చాకిరి చేయుచు
            గడుపు చుందురటులె కాలమెల్ల.
             
ఆ.వె:పలక పట్టు కరము పారపట్టగ వచ్చె
         పాలు గారు వయసు పనులు చేయ

         వలసి వచ్చె భువిని,వసివాడె బాల్యమ్ము
          చింత లేని బతుకు చేరు టెపుడొ.

ఆ.వె:పేదరికము వలన వీధులన్ ముష్టెత్తు
         కర్మ వచ్చె వీరి కనుచు జాలి
        వారి పైన చూపు వారలెవరు?బాధ
         దీర్చు వారలెవరొ తెలుపుడయ్య.

ఆ.వె:పిల్లలనగ వారు పృథ్విలో దైవాలు
         బాలవాక్కు లెపుడు బ్రహ్మ వాక్కు
          లట్టి వారి చేత ననువు గాని పనులు
         చెప్పి చేయుమనుట నొప్పు గాదు.

ఆ.వె:పాఠశాల కరిగి పాఠాలు నేర్వక
          పొలము పనులు చేయ పోరు బెట్ట
          వారి భవిత చెడును వసుధలో సతతమ
           టంచు తలచి వారి నాదరించు.

ఆ.వె:బాలకార్మికులను పనులందు పెట్టక
         బడికి పంప వారు భావి పౌరు     
        లగుచు వన్నె తెత్తు  రనయంబు నవనికి
        ననుచు నమ్ముడయ్య ననవరతము.

తే.గీ:చిట్టి చేతుల తోడను గట్టిగాను
        బరువు లెత్తుచున్నట్టి పాపలను చూడ
         వారి దుస్థితి బాపెడి పనులు చేయ
          దలచ వలెను ప్రభుత్వము దయను బూని

Monday, June 26, 2017

పంచభూతములు

26/6/17

మిత్రులందరికీ శుభోదయం.

అంశం:పంచభూతములు.

ఆ.వె:నేలగాలి నింగి నిప్పు నీరనునవి
        పంచభూతములని పలుకు చుంద్రు
         ప్రకృతి యొసగి నట్టి వరములంచరయుము
           వ్యర్థ పరచబోకు వాటి నెపుడు.

ఆ.వె:దనుజు డొకడు ముంచె ధరణిని నీటిలో
        దాని నెత్తి నిలిపె దనుజ హరుడు
        నదియె మనకు నిలువ నాధార మయ్యేను
         నట్టి తల్లి నెపుడు నాదరించు.

ఆ.వె:సకల జనుల శ్వాస జగతిలో గాలేను
       గాలిలేక మనము నిలువలేము
      వాయు వున్న తనువు ప్రాణభరితమౌను
       శ్వాస లేని యెడల శవమె నదియు.

ఆ.వె:అగ్ని లేని చోట నాకలి యణగదు
          ఆకలాగకున్న యలుపు వచ్చు
          యజ్ఞయాగము లకు నగ్నియవసరమౌ
          శుద్ధమైన దదియు జ్యోతి యదియె

ఆ.వె:శూన్య మిదియు ననుచు సుద్దులు చెప్పగా
         నచ్చెరువగు గాదె నవని యందు
          కర్మసాక్షి వెలయు క్రమము దప్పక తాను
           నొసగు చుండు రశ్మి యుర్వి యందు.

ఆ.వె:పంటకైన గాని వంటల కైననూ
         వలయు గాదె  శుద్ద జలము మనక
           నాగరికత దెలిసె నాడు నీటి వలనె
          జలము లేని యెడల జగతి లేదు./జరుగు టెట్లు.

Sunday, June 25, 2017

పంచారామాలు

పంచారామామములు.

1.అమరారామము

సీ:దేవతలకు నెల్ల దివ్యధామంబైన
      పుణ్యస్థలంబిది పుడమియందు
అమరేశ్వరునిగాను నమరుల చేతను
   వందనంబులు గొనుభద్రమూర్తి
పాండురాజు సుతుడు బాణంబు తోనాడు
   గొట్టంగ నయ్యెనో గుంట యపుడు
చైత్రశుద్ధమునందు సతిపతులకిచట
     బ్రహ్మోత్సవాలను వాసిగాను

ఆ.వె:జరుపుచుందురిపుడు జగతి యందు గనుము
  ఆది దంపతులకు నాచరింత్రు
పౌర్ణమి దినమందు బ్రహ్మానందముతోడ
అమ్మనయ్యను గని హాయి గనుడు.

2.సోమారామము

సీ: సోమేశ్వరుండన శుభములొసగి తోడ
   విజయమొసగుచుండు వేగ శివుడు
శ్వేతవర్ణమునందు శివలింగమును గన
  వింతయనుభవమ్ము వెలికి వచ్చు
తెలుపు రంగున యున్న తెల్లని లింగము
  రంగుమారుచునుండు రమ్యముగను
పౌర్ణమి దినమందు పాలధారల వోలె
  వెలిగేను యీస్వామి వింతగాను

ఆ.వె:చంద్రకళల తోడ చక్కగా వెలిగేటి
సోమరామ మిదియె చూడరండు
అమవస నిశి నాడు యగుపించు నీస్వామి
బూది రంగులోను గనుము భూరి గాను.

3.క్షీరారామము:

సీ:పాలకొలను యందు పరమేశ్వరుని రామ
        చంద్రుండు స్థాపించె జాయతోడ
 క్షేత్రపాలకుడిగా శ్రీ మహా విష్ణువే     
   శ్రీలక్ష్మితో గూడి స్థిరము గాను
జనుల కోర్కెల దీర్చ చక్కగా వెలసిన
   యారామ మిదె యందు రవని లోన
సకల పాపహరమౌ చక్కని కొలనును
   చక్రంబు తోడ నాస్వామి చేసె
ఆ.వె: నదియె రామగుండ మనెడి పుష్కరణయ్యె                               ఆయనమ్ములందు  నాలయాన
పర్వకాలమందు భానుని కిరణాలు
పర్వు చుండు నంట భవుని పైన.

4.ద్రాక్షారామము
    
సీ:సూర్యదేవుని చేత శోభాయ కరముగ
   నభిషిక్త మైనదీ యాలయంబు
దక్షిణకాశిగ దలచేరు జనములు
  భక్తిప్రపత్తుల పరవశించి
భోగము నొసగేటి భూరిలింగంబని
  వేనోళ్ళ భక్తులు విడిదిచేసి
మ్రొక్కులు దీర్చుచు ముడుపులు చెల్లించి
  కొలిచి తరింతురు కూర్మి తోడ

ఆ.వె:వేపచెట్టు నీడ వేడుకతో విష్ణు
        రావి చెట్టునీడ రహిని శివుడు
     వెలసి భక్తజనుల విన్నపాలు వినుచు
      నార్తి బాపు దురట ననవరతము.

5.కుమారారామము:

సీ:అసుర సంహరణకై నద్రిజా తనయుండు
   ఛేదించె నచ్చోట శివుని లింగ
మానాడు,దుర్భర యఘమును బాపుట
   కొరకటంచును తాను కూర్మితోడ
గట్టించె,నెన్నెన్నొ గమ్మత్తు లిచ్చో,వి
 శేషంబులు గలవు శివుని పాద
ములనుసూర్యకిరణములె మున్ను తాకంగ
 సంజవే ళలయందు సతిని తాకు

ఆ.వె:పార్వతమ్మ యిచట బాలత్రిపురసుంద
         రనెడి పేరు తోడ నాదరించు
        దయను చూపి శివుడు దండిగ వరములన్
          యొసగి కాచుచుండు నుర్వి యందు.

కాటేపల్లి వారి ప్రశంస


(మీ హృదయారామము స
త్సాహిత్యాదర్శము  హరతత్త్వము  నిడు నా
యూహాతీతుని లీలల
నీహలు  లయమందు  ననుచు నీ పద్యములే ! )


Monday, June 5, 2017

వృక్షసంపద

హరిత కవితకొరకు పద్యములు.

1.ఆ.వె: చెట్లు నాటుచుండ చేదోడు నీకగు 
నీరు పోసి పెంచ నీడ నొసగు 
పండ్లు పూల తోడ పరిఢవిల్లుచు నుండి 
హరిత హారమగును తరుల పూలు

2.ఆ.వె:మొక్క నొకటి నాటు మురిపెముతో పెంచు 
నీడ నొసగి నీకు తోడు నగును 
మూలమందు నీరు మురిపెముతో పోయ 
తలను వంచి యొసగు ఫలము నీకు. 

3.ఆ.వె:పచ్చనైన చెట్లు బాటకిరుగడల 
             నాటుమయ్య పుత్ర నీటుగాను 
             బాటసారులకది బాసటగా నుండి 
              హరితమయము లగుచు హర్షమొసగు. 

4.ఆ.వె:తరువు నొకటి నాటు తరతరములకును 
         బతుకు తెరువు చూపి బాధ తీర్చు 
          పచ్చనైన చెట్టు పసిడి కాంతుల తోడ 
        పరవశింప జేసి ఫలము లొసగు


5.ఆ.వె:పచ్చనైన చెట్లు భారతావనికొసగు 
             నంతులేని సిరుల ననవరతము 
            అగ్రదేశములకును నాదర్శ మగునట్లు 
పెంచవయ్య తరులు ప్రీతి తోడ.

6.ఆ.వె:హరిత భరిత మైన  తరుసమూహములెల్ల 
               యేపుగాను పెరుగ నింపుతోడ 
             ప్రకృతి కాంత మనము  పరవశమొందగా 
            హర్ష చిత్తులౌదు రవని జనులు

7.ఆ.వె:జగతి లోని జనులు సద్భావనము తోడ 
                చేయి చేయి కలిపి చెట్లు నాట 
               హరిత వనము వోలె నలరారు దేశమ్ము 
                పుడమి తల్లి తాను పులకరించు. 

8.ఆ.వె:భావి తరములందు ప్రజల కుపకరించు 
             తరులు పెంచ బ్రతుకు ధన్యమగును 
         సేద తీర్చునట్టి చెట్లను గాంచుచు 
            ముగ్ధులగుచు వారు మెత్తురయ్య. 

9.ఆ.వె:వృక్షసంపదున్న రేడువు నీవౌదు 
            లేమి యన్న మాట లేనె లేదు 
             ఆంధ్ర దేశమన్న నన్నపూర్ణ యనెడి 
          ఖ్యాతి నంది నట్టి ప్రాంత మిదియె. 

10.ఆ.వె:ఔషధోప యుక్త మైన వృక్షములను 
               విరివి గాను పెంచ విలువ పెరుగు 
              దేశమునకు ఖ్యాతి దేహమునకు మేలు 
              కలుగు చెట్లు పెంచి ఘనుడ వగుము..