Saturday, August 19, 2017

కవితాసుమాలు

సీతాకోకచిలుక
   రంగు రంగుల సీతాకోకచిలుకా
 అందించవే మాకు నీ ఒంటి మిలమిల
   గడియకో రంగు మారేవు నీవు
 సరికొత్త రంగుల్లో కనువిందు చేస్తావు
  నీ హొయలు నీ కులుకు చూస్తుంటె మాకు
 నిను తాకి ముద్దాడ మనసౌను చూడు
    ప్రతి పూవుపై వాలి అందంగ నీవు
    మకరందమే గ్రోలి మురిసి పోతున్నావు
   ఆ  తేనె లో తీపి నీ కంటె నేమో
   మరి మరీ తీయగా ముద్దొస్తు వున్నావు
   ఎవ్వరికి దొరకక వూరిస్తు వున్నావు
   ఒక్క చోటనైన కుదురుగా వుండనే లేవు
    రంగు లాగే బుద్ధి మార్చుకొంటున్నావు
   ఈ రంగు ఈ పొంగు స్థిరము గాబోదు
   వెలిసి పోయాకెవరు పట్టించుకోరు
   బాహ్యసౌందర్యము బుద్బుదప్రాయము
   అంతస్సౌందర్యము   అజరామరము.
బల్లూరి ఉమాదేవి
22/4/15

పేరు:డా.బల్లూరి ఉమాదేవి.

అంశం :గాంధీ జయంతి


*భరతమాతకు ముద్దుబిడ్డడు

భారతజాతికి మార్గదర్శకుడు

జాతికి నేత బాపూజీ

జాతికే పిత మన గాంధీజీ

సత్యాహింసలె ఆయుధాలుగా

సాధించాడీ స్వాతంత్ర్యం

కల్లా కపటాలెరుగనివాడు

కల్లలాడడం తెలియనివాడు

అతివాదులను మితవాదులను

సమైక్యపరచిన సహనశీలి

విద్యార్జనకై విదేశమేగిన

స్వదేశ హితమునె కోరాడు

ఆఫ్రికన్లకు అండగనుండి

దౌర్జన్యాలను నిరసించాడు

వర్తకానికని వచ్చినవారే

పెత్తనాలను చేస్తూవుంటే

మునిలా మౌనం పట్టనెలేదు

ఆవేశాన్ని చూపనె లేదు

సహనంతోనూ శాంతితోనూ

స్వరాజ్యాన్ని సాధించాడు

నూలువడకటం నేర్పాడు

ఖాదీ వస్త్రం నేశాడు

స్వదేశి వుద్యమం తలపెట్టాడు

విదేశి వస్త్రం వలదన్నాడు

మన సామాగ్రికె సుంకమెందుకని

నిలదీశాడు నినదించాడు

సమర శంఖం పూరించాడు

నేతగ ముందుకు కదిలాడు

జాతికి సాంత్వన కూర్చాడు

అందరి మనములు గెలిచాడు

అయ్యాడందుకె మహాత్ముడు

అందిద్దాం జోహార్లు

వేలవేల జోహార్లు.
డా.బల్లూరి ఉమాదేవి.
2/10/17.

Monday, August 14, 2017

శ్రీ కృష్ణుడు

శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో

కం:అష్టమ సుతుడై భువిలో
    శిష్టుల కావగ జనించె శ్రీకృష్ణుండై
     దుష్టుల దునిమెద తండ్రీ
     కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.

కం :పదునాలుగు భువనములను
      వదనముననె జూపినట్టి వంశీ కృష్ణా
       మధురంబగు నీ సుందర
     వదనమ్ము గనెడి యదృష్ట భాగ్యము నిమ్మా!

ఆ.వె:కొంటె కృష్ణుపైన కొండెముల్ జెప్పుచు
        పట్టి తెచ్చిరతని పడతులెల్ల
         తల్లడిల్లి తల్లి తనయు రోటను గట్ట
           నింతు లెల్ల గనిరి వింత తోడ.

ఆ.వె:వజ్రి యలుక చెంది వర్షమ్ము కురిపించ
          భయము చెంది గోప బాలురెల్ల
        నటునిటు తిరుగంగ నవ్వుచూ కృష్ణుండు
         కొండ నెత్తి కాచె కూర్మి తోడ.

ఆ.వె: వజ్రి కోపగింప వర్షముధృతమయ్యె
         గోపకాంత లదర,గోవులెల్ల
        బెదరు చుండ పలికె భీతి వలదటంచు
       శౌరి,యపుడె తాను శైల మెత్తె

ఉపేంద్రవ్రజము:
మురారి రారా మనమోహనా రా
విరాట రూపా వెత దీర్చగానూ
కరాభయంబిచ్చుచు కంజ నాభా
పరాకు నేలయ్య యోపంక జాక్షా.

ఆ.వె:యుద్ధ రంగమందు నుపదేశ మొనరించె
    నర్జునునకు గీత నాది లోనె
    నేటి కదియె గాద నెమ్మది నొసగేను
    సత్యమైన దిదియు జగతి యందు.

ఆ.వె:కృష్ణ నామ మొకటి తృష్ణను దీర్చేను
     కృష్ణ కీర్తనంబు కీర్తి నొసగు
      కృష్ణ కృష్ణ యన్న ఖిలమౌను పాపాలు
    కృష్ణుని గొలువంగ కీడు తొలగు.

ఆ.వె:వెన్నదొంగ వనుచు వేనోళ్ళ జనములు
       పొగడు చుందురయ్య పుడమి యందు
    వేదగోచరుడవు విశ్వంభరుండవు
       కావుమయ్య వేగ కమలనేత్ర.

ఆ.వె:వెన్న దొంగ వంచు వెక్కిరించగ బోను
       చీరలెత్తితివని చీర బోను
     వరము లొసగు నట్టి వాసుదేవా నిన్ను
      వెతలు దీర్చు మంచు వేడు కొందు.

Wednesday, August 9, 2017

మనమే ప్రపంచం కాదు.ప్రపంచంతోపాటు మనం



వింజమూరివారి పోటీ
"మనమే ప్రపంచం కాదు
ప్రపంచంతో పాటు మనం"
ఈభావం వ్యక్తమగునటుల వ్రాసిన పద్యములు.

1.ఆ.వె: పుట్టి పెరిగినట్టి పుడమిని విడనాడి
       నాది,నాకు యనెడి నాశ పెరుగ
        కన్న వారి నొదిలి వున్న వూరిని వీడి
        పయన మైతి వేల బస్తి కిపుడు.

2.ఆ.వె:బుద్ధి వచ్చు వరకు పోషించె జనకుండు
          రక్తమాంసములను రంగరించి
          పెంచి పెద్ద చేసె ప్రకృతి వనరులిచ్చి
         స్వార్థ బుద్ధి తోడ వదల బోకు.

3.ఆ.వె: జగతి యేమి యొసగె జంజాట మనబోకు
         జగతి కొసగు నట్టి సంచి యేది
         స్వార్థ పరత వీడి సాధించు ప్రగతిని
          అంతులేని ముదము నందగలవు.

4.ఆ.వె:సంఘ మన్న నెవరు సరిగ నరయుమయ్య
         నీవు నీది కాదు నెరుగ వయ్య
      సంఘమందు నీవు సభ్యుడ వేనోయి
       శ్వాసయుండు వరకు సత్యమిదియె.

5.ఆ.వె:మంచి చేయుచుండ మహిలోన మెత్తురు
         పరుల కెగ్గు జేయ పాపి వండ్రు
        పరుల హితము కోర బ్రతుకు పావనమౌను
       మంచి పథము నడచి మన్ననందు.

నమస్తే.ఈపద్యములు నా స్వంత రచన.ఇవి దేనికి అనుసరణకాని,అనుకరణకాని కావని సవినయముగా తెలుపుచున్నాను.
            ధన్యవాదములతో
                          శ్రీమతి ఉమాదేవి బల్లూరి

Sunday, August 6, 2017

స్నేహితులు

మిత్రులందరికీ శుభోదయం

స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

అంశం:స్నేహితులు

ఆ.వె:ఉండ వలయు భువిని నుత్తమ మిత్రుండు
        భార్య తోడ కూడ పంచ లేని
          విషయములను  తాను విశదముగ దెలిపి
             బడయగలడు శాంతి బ్రతుకు నందు.

ఆ.వె:ఇలను మిత్రు డెపుడు హితము గోరుచు నుండు
             నార్థికముగ తాను నాదుకొనుచు
            లేమి వేళలందు లేదనక ధనము
           నొసగి పంపు చుండు నుత్తముండు.

ఆ.వె:పిడికెడటుకులొసగి పెన్నిధి తానందె
         ననెడి కథను విందు మవని యందు
         నట్టి మిత్రు లెపుడు నాదుకొనుచునుండ
           శాంతి సుఖము కల్గు జనుల కెల్ల.

ఆ.వె:అన్ని వేళలందు నాత్మీయతను పంచు
         మిత్రుడొక్కడున్న మిసిమి యదియె
         ముదము నంద వచ్చు పుడమిలో సతతము
            కల్లకాదు నిదియె కటిక నిజము.

.ఆ.వె:కష్ట సుఖములందు కాపాడు మిత్రుండు
         నొక్క డైన చాలు నుర్వి యందు
         పంచుకొనుచునుండబాధ లెల్ల తొలగు
          మనసు తేలికగును మమత హెచ్చు.

.ఆ.వె:సృష్టిలోన జూడ తృప్తిని కల్గించు
          స్నేహబంధ మొకటె సేమ మొసగు
          నాప్తబంధువగుచు నన్నియు సమకూర్చు 
            నట్టి సఖుడు వలయు నవని యందు.

మిత్రులందరికి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు.

"ము"ఖ పరిచయం లేకపోయిన ము
"ఖ"పుస్తక మిత్రులతో చెలిమిని చేస్తూ వారి
"పు"రోగతి నాకాంక్షిస్తూ .. వేకువజాము నుండి మ
"స్త"కాలకు పని పెడుతూ,చేతి వేళ్ళనే
"క"లములుగా చేసుకొని వానికి పనికల్పించి
"మి"హిరుడు రాకముందే మేల్కొని మి
"త్రు"లకు శుభోదయం పల్కుతూ శ్రీ
"ల"క్ష్మీ పతి అనుగ్రహం కోరుతూ ఒకే
"కు"టుంబంలా కలసి మెలసి వున్న
"స్నే"హితులకు
"హి"తులకూ
"తు"ష్టిని పుష్టిని యొసగుమని
"ల"క్ష్మీకాంతుని ప్రార్థిస్తూ  ఈ సత్స్నేహం
"దినదిన ప్రవర్దమానంకావాలనీ మ
"నో"ల్లాసం అందరికి కలగాలని నిత్యో
"త్స"వం కావాలని జీవితంలో సతతము నవ
"వ"సంతం వెల్లి విరియాలనీ సకల
"శు"భఫలాలు పొందాలని ఎల్లప్పుడూ
"భా"షామతల్లిని కొలుస్తూ వుండాలని
"కాం"క్షిస్తూ ఆహరహం క్షరంకాని అ
"క్ష"రాలతో మన స్నేహ పరీమళా
"లు"దశదిశలా వ్యాపించాలని ఆకాంక్షిస్తున్నాను.

మొదటి అక్షరాలను గమనించండి.

Wednesday, August 2, 2017

అమ్మ

డా.బల్లూరి ఉమాదేవి
అంశం:అమ్మ.
         


  అమ్మ.

1.ఆ.వె:తల్లి ప్రేమ విలువ ధరణిలో నెంచంగ

    తరమె యేరి కైన దలచి చూడ

     ముద్దు మోము గాంచి మురియుచు నాతల్లి

       భాగ్యశాలి నంచు పరవశించు..


2.ఆ.వె:ఆకలెరగి తాను నడగక పోయినా

         కడుపు చూసి నింపు కరుణ తోడ

         సుంత బాధ పడిన సొమ్మసిల్లును తాను

        అమ్మ ప్రేమ కిలను నంత మేది.


3.ఆ.వె:తల్లి ప్రేమ కెవడు ధరను గట్టగలడు

           సాటిలేని యట్టి మేటి మమత

             నంద చేయు శక్తి యమ్మదే మహిలోన

           తల్లికన్న నెవరు దైవ మిలను.


4.ఆ.వె:విశ్వమందు తాను వేదనను భరియించి

           జన్మ మొసగు నట్టి జనని యెపుడు

            దైవ మేగ నెంచ ధరణిలో సర్వదా

           దైవతములకెల్ల దైవమామె.


5.కం:అమ్మను మించిన దైవ

        మ్మిమ్మహిలో నెందు గనిన నెచ్చట లేదే

         కమ్మగ బిడ్డలు తల్లిని

        నమ్మా యని పిలువగనె హాయిని బొందున్



6.ఆ.వె:ఆస్తులెన్ని యున్న నభిమానమే లేక

       అమ్మ ప్రేమ మరువ నధముడగును

      అట్టి వానిపైన నాదరణను జూపు

       నమ్మకన్న దైవ మవనినెవరు.


7.ఆ.వె:కన్నతల్లి యెపుడు కడుపు జూచుచు నుండు

      కంట నీరు జూడ కలత పడును

      అమ్మ మనసె పెద్దయంబుధి ధరలోన

      మరువ బోకు నీవు మాతృ ప్రేమ.

      తల్లికన్న నెవరు దైవ మిలను.


8ఆ.వె:కాళ్ళు బార జాపి కన్నొత్తి చెక్కొత్తి

         లాల పోసి తుడిచి లాలి పాడి

        నిదుర బుచ్చి నుదుట నిలువు బొట్టునుపెట్జి

      కనుచు మురిసి పోవు కన్న తల్లి.


9.ఆ.వె:తాను తినక సతము తనయులకని దాచు

     నమ్మ ప్రేమ కెపుడు నంతు లేదు

     మమత తోడ పంచు మాధుర్యమును బొంది

    మరువ పాడి గాదు మహిని నిజము.


10.ఆ.వె:అమ్మవంటి దైవ మవనిలో కనరాదు

           తండ్రి కోప గించ తాను కాచు

            అడ్డదారి చనిన బిడ్డను గాపాడ

           మ్రొక్కు లిడుచు తాను ముడుపు గట్టు.


11.ఆ.వె:అమ్మ మాట విన్న నన్నిభాగ్యములబ్బు

         అమ్మ దీవె నున్న నన్ని దొరకు

          అమ్మనవ్వు లోన నమృతమ్ము చిందురా

         అమ్మప్రేమ తోడ నాడు కోకు.


12.ఆ.వె:అమ్మ యలుక బూన నాదిశక్తియె యౌను

        ఆకలన్నవారి కన్న పూర్ణ

     తాటియాకు మంట తల్లి కోపమ్మురా

         అంతలోనె నదియు నారి పోవు.


13.ఆ.వె:చదువు లెల్ల నేర్చి సంస్కారయుతుడైన

      మురిసిపోవు గాదె ముసలి తల్లి

      కొడుకు ప్రేమ ముందు కోటిరూప్యములైన

         సమము కానె కావు జగతి యందు.     


14.ఆ.వె:అడక కుండ దీర్చు నవసరమ్ములు నన్ని

         ఆకలెరిగి తాను నన్నమిడును

  విసుగు యన్న మాట యిసుమంతయును లేక


యంత్రమల్లె చేయు నన్ని పనులు .


15.ఆ.వె:తనయులున్నతిగని ధన్యత నొందితి

     నంచు మురియు నమ్మ యవని యందు

    ముప్పు నందు గనుము ముదముతో తల్లిని

     యేమి కోర బోదు  యిలను తాను.

నాన్న పై వ్రాసిన పద్యములను పంపుచున్నాను పరిశీలించగలరు.
ధన్యవాదములండీ


నాన్న:

ఆ.వె:జన్మ నిచ్చు తండ్రి జగతిలో దైవమే

        కమ్మనైన మంచి కథలు చెప్పు

       నాన్న చెంత నున్న నాకమదియు గాదె

      అతని కన్న మిన్న నవని నెవరు?


ఆ.వె:జన్మకారకుడతడు సన్మిత్రు డౌతాను

         మమతచూపుచుండు మహిని  తాను

        అమ్మ కోప పడగ నక్కున చేర్చుకు

          నాదరించు నతడు నాదరించు.


ఆ వె:కన్న సంతు కొరకు కష్టాలు పడితాను

      కూడబెట్టుచుండు కువలయాన

      తనకు లేని విద్య తనయులకు వలెన

      టంచుతపన చెందు నహరహమ్ము.


ఆ.వె:తనయు నున్నతిగని ధన్యుడైతిననుచు

        మురిసిపోవు తండ్రి ముదము తోడ

        ముసలి వాడటంచు ముప్పునందు విడక

        కంటిరెప్పవోలె కావుమయ్య.


ఆ.వె:తప్పు చేయ కొడుకు దండించుచుండును

       బాధ కల్గినపుడు సేద తీర్చు

      సఖుడు తానె యౌను సంకటములొదవ

     దైవమన్న తండ్రె ధరణి యందు.


Wednesday, July 12, 2017

పెద్దనోట్లరద్దు

పెద్దనోట్లరద్దు పెనుశోకమును మిగిల్చె
పెద్దవారి అండదండలతో కొందరి
పైకమెల్ల భద్రమయ్యె ముందు జాగ్రత్తగా
సామాన్యులెల్లరు సొమ్ముండి పేదలై
కష్టాలపాలైరి కువలయాన
ముందుచూపుతోడ ప్రభుత చేసిన కార్య
మరసిన నల్లకుబేరులు మందిపేర్లమీద
ధనము జమను చేసి తెల్లకుబేరులైరి నిజము
ఇంటి ఖర్చులకనుచు దాచుకొనిన ధనము
నిరుపయోగమనుచు నెరిగి నెరిగి
మార్చుకొనగ శ్రమను పడగవలసె
నోట్లరద్దువల్ల నాగె వివాహాలు
కొనుగోళెల్ల నిలిచిపోయె
వున్నవాడు మరింత వున్నవాడయ్యె
సగటుమనిషు వుండి లేనివాడయ్యె
రైతన్నలకెల్ల చిల్లర కష్టాలు చుట్టుముట్టె
కూలివారికొసగ చిల్లర కొరతాయె
అన్నదాతలగోడు నరణ్యరోదనమయ్యె
అందుకే మరల ఇప్పుడు పెద్దనోట్లు రద్దు
చేయ నెంచసత్ఫలితంబు రావచ్చు
"పిచ్చితుగ్లక"నుచు గేలిచేసిన కాని
కొత్తనోట్ల నిపుడు రద్దుచేయ
నల్లధనమదెల్ల వెలికి వచ్చు
విజయమందవచ్చు మోడి విశ్వమందు
శుభములకైనను నశుభాలకైనను
వలయుగాదె ధనము నెల్లవారికిని
సొమ్ములేక పనులు జరుగు టెట్లను
తలపు శూన్యమయ్యె నేతలందు
మంత్రదండమున్న మాయచేసియైన
మామూలు స్థిగతులు తెమ్ము వేగ



Wednesday, June 28, 2017

శుభోదయం

మిత్రులందరికి శుభోదయం.
పద్యాల సవ్వడి

అంశం:బాలకార్మికులు

ఆ.వె:పొట్ట కూటి కొరకు పుడమిలో పిల్లలు
         పసి వయసున పొలము పనులు చేయ
          పట్టణముల వైపు వలసవెళ్ళుచు నుంద్రు
         వారి నటుల జూడ బాధ కలుగు.

ఆ.వె:పలక బలపములను వాసిగా నిడుకొని
           బడికి వెళ్ళు వయసు బాల లెల్ల
            శనగ తోట లందు చాకిరి చేయుచు
            గడుపు చుందురటులె కాలమెల్ల.
             
ఆ.వె:పలక పట్టు కరము పారపట్టగ వచ్చె
         పాలు గారు వయసు పనులు చేయ

         వలసి వచ్చె భువిని,వసివాడె బాల్యమ్ము
          చింత లేని బతుకు చేరు టెపుడొ.

ఆ.వె:పేదరికము వలన వీధులన్ ముష్టెత్తు
         కర్మ వచ్చె వీరి కనుచు జాలి
        వారి పైన చూపు వారలెవరు?బాధ
         దీర్చు వారలెవరొ తెలుపుడయ్య.

ఆ.వె:పిల్లలనగ వారు పృథ్విలో దైవాలు
         బాలవాక్కు లెపుడు బ్రహ్మ వాక్కు
          లట్టి వారి చేత ననువు గాని పనులు
         చెప్పి చేయుమనుట నొప్పు గాదు.

ఆ.వె:పాఠశాల కరిగి పాఠాలు నేర్వక
          పొలము పనులు చేయ పోరు బెట్ట
          వారి భవిత చెడును వసుధలో సతతమ
           టంచు తలచి వారి నాదరించు.

ఆ.వె:బాలకార్మికులను పనులందు పెట్టక
         బడికి పంప వారు భావి పౌరు     
        లగుచు వన్నె తెత్తు  రనయంబు నవనికి
        ననుచు నమ్ముడయ్య ననవరతము.

తే.గీ:చిట్టి చేతుల తోడను గట్టిగాను
        బరువు లెత్తుచున్నట్టి పాపలను చూడ
         వారి దుస్థితి బాపెడి పనులు చేయ
          దలచ వలెను ప్రభుత్వము దయను బూని