Saturday, January 28, 2017

సమస్యా పూరణం - 2

శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన
న్యస్తాక్షరి:-భూ కం ప ము అనే అక్షరాలు మొదటి అక్షరాలుగ ఊర్చిన తేటగీతి పద్యము.శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన
తే.గీ :భూమి భారము మోసెడి భూమితల్లి
కంపనమొనరింప గతియు గానమిలను
పచ్చ పచ్చని తరువులు వడలి పోవు
ముప్పు దప్పదు ప్రజలకు పుడమి యలుగ/కినియ
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యము
ఆ.వె:గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రుడెపుడు మనకు రక్ష.
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యము
ఆ.వె:గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
రామలక్ష్మణులును రయముతోడ
మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
రామచంద్రుడెపుడు మనకు రక్ష.
అక్షరకవిత 19 :
కృష్ణాతరంగాలు :తృతీయబహుమతి నందిన కవిత.
మొదటి అక్షరం "ద "చివరిఅక్షరం "మ "వచ్చేలా వ్రాసిన కవిత.
దరహాస చంద్రికల వెదజల్లు ఓ చందమామ
దరిసెనము కొరకు వేచినదీ కలువభామ
దక్షప్రజాపతి కూతుళ్ళ నిచ్చి నీకు అయ్యాడు మామ
దర్శించినంతనే నీపై కలిగేను ప్రేమ
దరి చేర రమ్మంటు పిలిచె నీ వనసీమ
దగ్గరగ రమ్మంచు తలయూచు నీ సుమ
దక్షిణ దిశ గలదు మేమున్న సీమ
దయచేసి రావోయి దగదగల మామ
దర్పకుని విరహాన వేగేను భామ
దరిచేర్చు "ప్రియు" నంచు కోరె నీ లేమ
దళముతో తూచేను శ్రీకృష్ణు నా రమ
దవనమును గూర్చుచు మాలలల్లె లలామ
దధిచోరుని చేర వచ్చేనిట గొల్లభామ
దయతోడ నెల్లరను కాపాడునది క్షమ
దయగల స్వామి చూపును తన మహిమ.
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యాలు.
కం: భక్తిని జూపుచు కాళము
శక్తిన్ జూపుచు కరియును సలిపెన్ సేవల్
యుక్తిగ లూతయు జేయగ
ముక్తిని మువ్వురు బడసిరి పూజల చేతన్.
ఆ.వె :భక్తి తోడ గొల్చె పాము వనము నందు 
శక్తి తోడ హస్తి సల్పె పూజ
నేర్పు జూపి లూత నేసె వస్త్రంబును
ముక్తి నంది రెల్ల పూజ సేయ.
ధనికొండ రవిప్రసాద్ గారిచ్చిన సమస్య:
*కరములు నీ కరములు కనికరమున గనుమా.*
నాపూరణ:
కం:సరసిజనాభుని రాణివి
వరముల నొసగెడి జననివి వాసిగ గొల్తున్
సిరులను మెండుగ నిడు,శుభ
కరములు నీ కరములు కనికరమున గనుమా.
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యాలు.
1 కం:అన్నా!యిదినిజమేనా!
వెన్నయు మీగడలకు కొదవేమిటి యింటన్/నాన్నా
మన్నెందుకు దిన్నావని
వెన్నుని యడుగన్ యశోద వింతగ నవ్వెన్.
2.కం :అన్న బలరాముఁ జెప్పగ
విన్న యశోద యు కరమును విసురగ నెత్తన్
మన్నున్ దినలేదంచా
యన్నులమిన్నకు సుపుత్రుడాస్యము జూపెన్./యన్నులమిన్నకు తనయుడు యాస్యము జూపెన్.
3.:కం :పదునాలుగు భువనములను
వదనముననె జూపినట్టి వంశీ కృష్ణా
మధురంబగు నీ సుందర
వదనమ్ము గనెడి యదృష్ట భాగ్యము నిమ్మా!
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యాలు.
కం:వదనమున సిగ్గు దొంతర
లొదవన్ నాథుని సురూపు నూహింపంగన్
మదిలో దాచిన ప్రేమన్
పదిలముగా కూర్చె పడతి పత్రము పైనన్
సమస్య:శంకరాభరణం బ్లాగ్ లోనిది.
*
భీముండు ప్రసిద్ధుడయ్యె బిఱికి తనమునన్ *
కం :నామము చేతను మనుజులు
సామాన్యంబుగ నెవరును సరిపోలరిలన్
భీముడను పేరు గల యీ
భీముండు ప్రసిద్ధుడయ్యె బిఱికి తనమునన్
కృష్ణాతరంగాలు గ్రూప్ లో ఈక్రిందిచిత్రానికి ద్వితీయ బహుమతినందిన నాకవిత
డా: బల్లూరి.ఉమాదేవి.
26/4/15
అవని వేదన:
సహనశీలివంటు మునగచెట్టెక్కిస్తారు
ముందరి కాళ్ళకు బంధాలే వేస్తారు
సహనముకు హద్దుంటుందని తెలుసుకోలేరు
మీ బరువునెప్పుడూ యెత్తుకొని తిరిగేను
ప్రతిఫలంబేదియు నాశింపనూలేదు
నా మానాన నన్ను బ్రతుక నిచ్చుట లేదు
చెత్తా చెదారలతో ముంచెత్తు తున్నారు
అలనాడు నను నీట ముంచె నా రక్కసుడు
వుద్ధరింపగ వచ్చె నా పరంధాముడు
నేడెవరితో నేను మొర పెట్టుకోను
కాపాడి కరుణించు నాథు డెవ్వాడు
ఆగ్రహంబున నేను వురిమి చూశానంటె 
కంపించి పోయేను భూగోళమంతా
నిలువనీడైన మీకు దొరకదిది నిజము.
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:మనసు నిండ నిండె మనమోహనుని రూపు
దేహము పులకించె తృప్తి తోడ
గానమందె తాను గానసుధను జిందె
భామ యొప్పె భక్తి భావమలర

మస్య:శంకరాభరణం బ్లాగ్ లోనిది.
*
పండితుడెందులకు పనికి వచ్చు ధరిత్రిన్*
కం : మెండుగ సంపద లున్నను
దండిగ వాగ్ధాటి శక్తి దన్నుగ నున్నన్
మొండిగ వాదన చేయు కు
పండితుడెందులకు పనికి వచ్చు ధరిత్రిన్.
అక్షరకవిత :18
ద్వితీయ బహుమతి నందిన కవిత.
కృష్ణాతరంగాలు గ్రూపు లోరెండవ అక్షరం "న "వుండేలా వ్రాసిన కవిత.
అనవరతము నిన్నె ధ్యానించు చున్నాము
పీనవక్షా నిన్ను కోరి కొలిచెదమయ్య
మనసార నిను మ్రొక్క తరలి వచ్చాము
గానలోలా నిన్ను మెప్పించలేము
ఘనమైన కానుకల నిచ్చుకోలేము
వినగానె నీ పేరు మది మురిసిపోయెను
జనములో పల మమ్ము చులకన కానీకు
తన ఎవరొ పర ఎవరొ తెలియ లేకున్నాము
ధనమున్న మనుజులకే జే జే లు నేడు
మనవారె పరులైన గతి యేది యిలలో
పైన పటార మన్న మాట నిజమేను
వైన ఏమిటొ నీది తెలియలేకున్నాము
వనమందు ఆ ధ్రువుని కరుణించినావు
కానలో యా గజరాజు మొర నాలకించావు
దీనవత్సల మమ్ము కావంగ రావయ్య.
శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన దత్తపదులు.
"
జలుబు దగ్గు నొప్పి నలత "రామాయణార్థంలో
నాపూరణ:
ఆ.వె :ప్రజలు బుద్ధిగ గన భవుని విల్లు విరిచెఁ
దగ్గు మనెడి పరశుధారి నణచె
నువిద యనుజు తోడ నొప్పి కానకుఁ జనె
వనలతలఁ గనుచును వసుధపతియు.

శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె: అలుపు సొలుపు లేక నన్నిపనులు జేయు
నేటి మహిళ కెవరు సాటి యిలను
అష్ట భుజము లున్న యాదిశక్తిని బోలి
యింట బయట పనుల నిర్వహించు.
డా.బల్లూరి ఉమాదేవి.
23/4/15.
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
కం: అల్లరి కృష్ణునితో రే
పల్లెన్ నిను పోల్చెదరట పడతులు కినుకన్
గొల్లల తోడను నీవలె
చల్లయు,పాలును పెరుగును చాటుగ తినగన్
శంకరాభరణం బ్లాగ్ లోని సమస్యకు నాపూరణ
*
సుతు పదముల వ్రాలి తండ్రి స్తుతులొనరించెన్ *
:కం: పితృ వాక్య పాలకుండై
యతి హరుషము తోడ తండ్రి యానతి మేరన్
సతితో రాముడు కోసల
సుత పదములవ్రాలి తండ్రి స్తుతులొనరించెన్.
కృష్ణా తరంగాలు గ్రూప్ లో "అక్షరకవిత"17 కు
మొదటి అక్షరం "త "చివరి అక్షరం " మ "వచ్చేలా వ్రాసిన ఈ కవితకు ప్రథమబహుమతి లభించింది.
డా.బల్లూరి ఉమాదేవి.
22/4/15.
తరగని పెన్నిధి ఇలలో కన్నవారి ప్రేమ
తగ్గుతోంది రోజురోజుకు కన్నవారిపై ప్రేమ
తరగతి గదుల్లో పడాలి విద్యార్థులు శ్రమ
తరువాత జీవితంలో పొందగలరు మధురిమ
తనకు మాలిన ధర్మం మంచిది కాదంటుందీ లేమ
తలరాత బాగా లేదంటూ కూర్చోవడం భ్రమ
తప్పు దిద్దుకొని ముందుకు సాగమంటోంది కట్టుకొన్న భామ
తటిల్లతలా మెరిసిపోతుందీ లలామ
తరుణి నుదుట ప్రకాశిస్తోంది ఎర్రని కుంకుమ
తడవ తడవకు గింజ గింజను సేకరిస్తుంది చీమ
తలచుకొంటే ఏదైనా సాధించేలా వుండాలి ధీమ
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె: తులసి కోట చెంత ధూప దీపములతో
పూజ చేసి పిదప పూలు దెచ్చి
.
మాలగ నొనరించి మమతతో నర్చించు
మహిళ పొందు శుభము మహిని జూడ.
కృష్ణా తరంగాలు గ్రూప్ లో (ద్వితీయబహుమతి నందిన )రెండు పాదాలకు ఒకే అంత్యాక్షరం వుండేలా అక్షరకవిత.
బల్లూరి ఉమాదేవి.
20/4/15
జాబిల్లి
షోడశ కళలతో విలసిల్లువాడు
గగనాన మెరిసేటి వెన్నెలరేడు
నిను చూసి మెరిసేను ఆ కలువభామ
తనకు తానై వచ్చి అందించు తన ప్రేమ
కలుముల రాణికి నీవు సోదరుడవు
అందుకే జనులకు మామ వైనావు
అలనాడు పుట్టావు క్షీరసాగరమున
నిండుగా వెలిగేవు పౌర్ణమి రోజున
శ్రీహరికి స్వయాన బావమరిదివే నీవు 
హరునకు శిరోభూషణుడ వయ్యావు 
నీతోడ దోబూచు లాడేను మేఘాలు
నీ కొరకు దిశలన్ని వెదికేను తారలు
ఆలసింపక నీవు అగుపించవోయి
ఆ తారలకు తళుకు లందించవోయి
ఆరుబయట పండువెన్నెల్లో మేము
నిను చూస్తు హాయిగా నిదురపోతాము
బల్లూరి ఉమా దేవి.
21/4/15
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
కం: అష్టమ సుతుడై భువిలో
శిష్టుల కావగ జనించి శ్రీకృష్ణుండై
దుష్టుల దునిమెద తండ్రీ
కష్టములిక తొలగునంచు కమ్మగ పలికెన్.
బల్లూరి ఉమాదేవి.
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:మొద్దునిద్ద రోవు మొరకు రక్కసు లేపి
కరులు,గదలతోడ గాయ పరచు
భటుల జూచి కోప భరితుడగుచు కుంభ
కర్ణు డడిగె లేప కారణంబు.
.
ఆ.వె:సమర రంగమందుసాయపడెడివాడు
కుంభకర్ణు డచట కునుకు దీయ
గదుల కరుల తొడ గాసి పెట్టియు నైన 
యతని తెండ టంచు యసురు డనియె.
డా.బల్లూరి ఉమా దేవి
18/4/15.
డా.బల్లూరి ఉమా దేవి
18/4/15.
సమస్య:-*కోడిని కరకర నమలె కోడలమ్మ*
తే.గీ:కడుపుతోనున్న కోడలి కత్తగారు
బహు రుచికరము లగుపిండి వంట లిడగ
కరకర మనెడి యాజంతికనుమరియు,
కోడిని కరకర నమిలె కోడలమ్మ.
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
75.ఆ.వె:పుడమి కడుపు నుండి పుట్టె నొకమొలక
పరవశించి జూచె పాప దాని
ప్రేమతోడ తాకి ప్రియమార ముద్దిడు
తనయ జూచి తల్లి తాను మురిసె.
బల్లూరి.ఉమాదేవి.
19/4/15
శంకరాభరణం :
సమస్య kiss emoticon భర్త యల్లుడయ్యె భామ కపుడు*
ఆ.వె:అసురు సంహరించి యవనిని కాపాడి
ధరణి దేవికి హరి ధవుడు నయ్యె
శివధనువును విరిచి సీతను పెండ్లాడి
భర్త యల్లుడయ్యె భామ కపుడు.
బల్లూరి.ఉమాదేవి
17/4/15
16 4 15
శంకరాభరణం బ్లాగ్ లో క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యము.
అ.వె:పడక కుర్చి యిదియె పరమసౌఖ్యకరము
వూసు లెన్నొ జెప్పు నూర డించు
విసుగు చెంద నీక విశ్రాంతి కలిగించు
అలసిన తనువునకు హాయి నొసగు.
బల్లూరి ఉమాదేవి.
కృష్ణా తరంగాలు గ్రూప్ లో "అక్షరకవిత"15 కు
మొదటి అక్షరం "క "చివరి అక్షరం " ల "వచ్చేలా వ్రాసిన ఈ కవితకు ద్వితీయబహుమతి లభించింది.
డా.బల్లూరి ఉమాదేవి.
17/4/15.
తమి
కన్నయ్య మెడలోన కమనీయమాల
కనులార గాంచుటకు పోదామ కోవెల
కమలాక్షు నెడదలో కొలువున్న కమల
కమలనేత్రుని జూచి నవ్వేను కిలకిల
కన్నియల మది దోచు రేపల్లె గోపాల
కరుణించి కాపాడు శ్రీలక్ష్మిలోల
కమలనాభుడవీవె కరుణాలవాల
కరి మొరను విన్నట్టి కారుణ్యశీల
కలవర పడనేల అందాల బాల
కలహంస నడకలతొ కదలి రావేల
కలకంఠి నీకంట కన్నీరు ఏల
కలకలలాడుతూ ధరియించు మేఖల
కలువభామను చూడ కురిసేను వెన్నెల
కలిసి నడుద్దామ వెన్నెల్లొ తిరుమల
కలియుగ దైవమ్ము వలసినదీ నేల
కనుపాపలా కాచి రక్షించు బెంగేల.
శంకరాభరణం బ్లాగ్ లో ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె: రావణాసురుండు రమణిని గొంపోవ
నాప దానవేంద్రు నడ్డు పడిన
పక్షిరాజు జంపె పంక్తి కంఠు డపుడు
శోక భరిత యయ్యె సుదతి సీత.
డా . బల్లూరి ఉమాదేవి
16 4 15
ఉపశమనతరంగాలు గ్రూప్ లో చిత్రానికి నేను వ్రాసిన కవిత.
డా.బల్లూరి .ఉమాదేవి
14/4/15
ఆసరా
ఎవరి కెవరమో తెలియదు నిన్న
ఒకరి కొకరముగ ఉన్నాము నేడు
గూడు లేని గువ్వలం నీడ లేని జనాలం
నా ఒడే నీ తలగడ నిదుర పో హాయిగా
చింతలన్ని వదిలేసి ఉండరా చల్లగా
అక్కగా నేనున్నా ఏడవకురా కన్నా
అమ్మలా లాలిస్తా అన్నమే తినిపిస్తా
కష్టాలు కన్నీళ్ళు మనలాంటి వాళ్ళకే
ఏడ్చి ఏడ్చి వాటిని ఖర్చు చేయొద్దురా
ఆత్మాభిమానమే మనకున్న ఆస్తిరా
దాన్ని అమ్ముకోకుండా బ్రతికేద్దామురా
ఆకలంటె ఏమిటో తెలిసిన దానను
నీ ఆకలి బాధను గుర్తించ గలనురా
నీకోసమే నేను పనులెన్నొ చేస్తాను
కష్టాలకోర్చి నిను కాపాడుకొంటాను
చదువు సంధ్యలు నేర్వ బడి కంపుతాను
పెద్ద చదువులు నీవు చదివి ఎదగాలిరా
మనలాంటి వారందరికి కావాలి ఆసరా.
శంకరాభరణం బ్లాగులోని ఈక్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
తే.గీ: శంకరభగవత్పాదుల సమ్ముఖమున
కన్ను మూసెను దృప్తిగ కన్న తల్లి
ధన్యతను గాంచె నామాత ధరణి యందు
ముదమునన్ వచ్చెను విమానము గొని పోవ
బల్లూరి.ఉమాదేవి.

శంకరాభరణం బ్లాగులో ఈక్రింది చిత్రానికినేను వ్రాసిన పద్యము.
ఆ.వె పసిమి చాయ తోడ పడతి మెరయుచుండ
చెంప సరములదిరె చెవుల నిండి
అందమైన బుగ్గ లందము చిందించ
మురిసి మగడు సతిని ముద్దు చేసె.
కృష్ణాతరంగాలుగ్రూప్ లో నిర్వహించిన అంత్యాక్షరి లో ప్రథమ బహుమతి నందిన కవిత.
డా.బల్లూరి.ఉమాదేవి.
14/4/15
తపన
నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉన్నా
ఎంత సేపైనా చెంతకు రావేంటి కన్నా
ఎవరికి చెప్పను నా వేదన
ఎలా తీరుతుంది నాతపన
పదహారువేలమందిసఖులు ఉన్నారు నీకు
దొరకక దొరకక దొరికేవు నీవొక్కడవె నాకు
పట్టు పానుపులు నీకు పరచగా లేను
పదిలంగా దాచిన ప్రేమ నందివ్వ గలను
గోవర్ధనంబెత్తిన గోపాల బాల
నా ఆర్తి తీర్చంగ తరలి రావేల
కన్నాను నిను కోరి ఎన్నెన్నో కలలు
కానీకు రాకుండ వాటిని కల్లలు
అల్లంత దూరాన మ్రోగేను మురళి
పదపదమంటుంది నా అందె రవళి
ఇకనైన కరుణించి నన్నేల రావా
ప్రేమాంబుధిలో నన్ను ముంచెత్తి పోవా
నీ వూహలే నన్ను బ్రతికిస్తు ఉన్నాయి
వూసు లెన్నో చెప్పి మురిపించ రావోయి
మాధవా మనలేను క్షణమైన నిను వీడి 
కలిసి వుందామోయి ఇకపైన జత గూడి.
శంకరాభరణం బ్లాగులోని ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యము.
ఆ.వె:యక్షరూపు తోడ యమధర్మరాజట
ప్రశ్న లేయ సాగె పాండుసుతుల
బదులు చెప్పలేక బాధతో గూలంగ
ధర్మజుండు జెప్పె ధైర్యముగను.
ఏప్రిల్ 13, 2015 12:31 [PM]
అక్షరకవిత:13.
రెండు పాదాలలో ఒకే అక్షరం వుండేలా వ్రాసిన అంత్యాక్షర కవిత.
గణపతి:-
మ్రొక్కులిడెదము నీకు కరిముఖ గణపతి
కరుణతో కాపాడి యోసగుమా సన్మతి
శివ పార్వతుల ప్రియమైన పుత్రుడవు
విఘ్నములు తొలగించు ఆదిపూజితుడవు
నైవేద్యమునకై ఉండ్రాళ్ళు పెడతాము
కోరికలు తీర్చమని గుంజిళ్ళు తీస్తాము
నిను జూచి ఫక్కున నవ్వె నా నెలరేడు
ఫలితముగ శాపాన్ని వెంటనే పొందాడు
షణ్ముఖునకు నీవు అయ్యావు భ్రాత
చేశారు దేవతలు నిను గణములకు నేత
నలుగుతో నిను చేసె నా యాదిశక్తి
సన్మార్గమున నడువ మాకొసగు శక్తి
హస్తమన్న నీకు తొండమే గణపయ్య
తొండమెత్తీ మమ్ము దీవించవయ్య
నీ నడుముకున్నది అతి పెద్ద పాము
నిను కొలిచి తరియించెదము మేము .
డా.బల్లూరి.ఉమాదేవి
12/4/15.
ఈ చిత్రానికి నేను వ్రాసిన పద్యం.
ఆ.వె:సుమధురమగు నట్టి సుందర హారంబు
భక్తు లొసగి నట్టి భవ్య మాల
తులసి తోడ చేర్చి తోమాలగా చేసి
స్వామి మెడను వేయ సంతసించె

Umadevi Balluri
ఆశే నా శ్వాస:
ఏ జన్మలో చేశానో తపము
ఈ జన్మలో పొందాను వరము 
ఎక్కడో అనాథగా పుట్టాను నేను
ఇక్కడే చిన్ని చేతుల్లో ఇమిడి పోయాను
తన పేరుకు ముందో వెనుకో చేరిపోయాను
తన చేతిని విడువక ఆభరణమై పోయాను
తనువంతా గాయాలైనా
బాధ లేదు ఇసుమంతైనా
తన మోవి తగిలితే చాలు
పలుకుతా యెన్నెన్నో రాగాలు
నాకు లేదు భాషా భేదం
మీకొసగేను అమితానందం
నాలో నుండి వచ్చే స్వరం
చేరుస్తుందిదే బృందావనం
పూలతో పాటు దారానికి అబ్బుతుంది తావి
నాజన్మ చరితార్థమైంది చేరి తన మోవి
ఇంతకన్నా లేదు మరో ఆశ 
ఇదే ఇదే కావాలి నాకు శ్వాస.
ఈ క్రింది చిత్రానికి నేను వ్రాసిన పద్యము.
ఆ.వె :ఆవకాయ మరియు నన్నము కూరయు
చూడ త్వర పడమను చుండెను గద
రసన,పప్పు తోడ రసము నోరూరింప
వేగ రండు యింక వేచుటేల.

గజమాల :--
గజమాల వరమాల వైజయంతీమాల 
పేరు యేదియైన దేవదేవుని మెడను మెరిసేటి మాల
బ్రహ్మోత్సవాలలో బ్రహ్మాండ నాయకుని 
గళమలంకరించి ప్రత్యేకతను గూర్చేటిదీ గజమాల 
కల్యాణోత్సవంబున కమనీయముగ నుండి
కనువిందొనర్చునదీ వరమాల
నేరుపుగ భామలు పొందికగ నొద్దికగ 
యరటి నారను కూర్చిన దీకదంబమాల
మల్లెలు మొల్లలు చామంతులతోడ
గులాబీలను చేర్చి కూర్చినదీ పూలమాల
నామాలస్వామికి తోమాలసేవంటూ 
అర్చకులు చేతురు సుప్రభాతపువేళ
అలనాడు ఆండాళు విల్లిపుత్తూరులో
శ్రీరంగని కిడిన ముడిచి విడిచిన మాల
అలిమేలుపతికిట నర్పింతు ప్రేమతో
మనోహరంబైన మమతలమాల.
బల్లూరి ఉమాదేవి
10/4/15.
అక్షర కవిత:
ఆద్యక్షరము "ర "అంత్యాక్షరము "ల "వచ్చేలా వ్రాసిన కవిత.
రజనీకరుడరుదెంచి యందించె వెన్నెల
రమారమణుడైన కన్నయ్య మ్రోల
రమణీమణులెల్ల పరవశాన తేల
రక్తితో సాగె నట రాసలీల
రహి తోడ వేచిరి గోపికలెల్లరావల
రసికుడా వెన్నుడు దాగి వేసెను ఈల
రతనాల హారమట మెరిసేను మిలమిల
రయమున దాచె నాగోపిబాల
రట్టు సేయకు మంచు వేడె నా బేల
రమ్మంటు పిలిచేవు తేలించు మురిపాల
రమ్యమైన మురళి శోభిల్లె కిట్టయ్య కేల
రజ్జువుతొ కట్టె యశోద సుతుని యామూల
రసవతిలొ చేరిన మగువలదె గోల
రమణుల చేతుల గాజుల గలగల
రసనకు కారము తగిలితే తప్పదు విలవిల
రక్షించిన శిక్షించిన అది స్వామి లీల
రసరాజు కృష్ణుడే ఆసరా మనకన్ని వేళల

అక్షరకవిత 10 లో మొదటిఅక్షరం "అం"చివరి అక్షరం "ము "తో వ్రాయా లన్నారు. ఇది నాస్పందన
అంతారామమయము
అంతా రామమయం జగమంతా రామమయము
అందరికి ఇష్టమైనది రామనామము
అంగడిలో దొరకనిది రామనామము
అంగన సీతకు రామునితో పాణి గ్రహణము
అంగరంగ వైభోగముగా జరుగును గుడిలో కల్యాణము
అంజనీ తనయుడట రామున కొనరించును వందనము
అందమైన పూలతో చేసిన అలంకారమది శోభాయమానము
అంటీ ఫలములను నైవేద్యముగా నిడి పంచుదము
అంజలి ఘటించి రాముని ఆరాధించెదము
అంభోజ నయనుని అనుగ్రహము పొందెదము
అందరికీ శ్రీరఘురాముడే ఇలలో ఆదర్శము
అందులో లేదు ఆవగింజంతైన అనుమానము
అందరూ మెచ్చెడిదీ దివ్య స్వరూపము
అందరికిచ్చును స్వామి అభయ హస్తము
అందాల రాముని శుభ దర్శనము
అందువలన కలుగు అమితానందము
అందరము కలిసి ఇత్తుము నీరాజనము
అందుకొనగ రమ్ము ప్రసాదము
అందరి కెల్లప్పుడు కలుగును జయము
Umadevi Balluri
సొంతిల్లు అనేది మధ్యతరగతి వారికి పగటికల 
అదో గగన కుసుమమంలా భావించే వారొక్కప్పుడు
బహుళ అంతస్తుల భవనాలొచ్చాక
సాకారమవుతున్నాయి మధ్యతరగతి ఉద్యోగి కలలు
ప్రకటనలు చూసి మురిసి పోతాడు 
అహరహం లెక్కలేస్తాడు
వాయిదాల పద్ధతిలో ఋణం తీర్చుకోవచ్చనుకొంటాడు
అన్నిటికి సిద్ధపడి అడుగు ముం దుకేస్తే అన్నీ ఆటంకాలే 
హామీలు పూచీకత్తులు కావాలంటారు ఋణమిచ్చే వాళ్ళు
బాలారిష్టాలన్నీ దాటుకొని వెళ్ళాలనుకొన్నపుడే వస్తోంది మరోసందేహం
రెండు పడగ్గదుల ఇల్లా?మూడు పడగ్గదులదా?
ఒక్కసారే కొంటాం మళ్ళీ మళ్ళీ కొనలేమంటూ ఇల్లాలి సణుగుడు
నొప్పింపక తానొవ్వక కూడబెట్టిందంతాకలిపితే పూర్తవుతుందోఘట్టం
గృహప్రవేశం తరువాత అసలుకథ ఆరంభం
ఇరుగు పొరుగు బాగుంటే కథ సుఖాంతం
కాకుంటే ప్రతిరోజూ కలహం
ఐనా ఇదో మినీ భారతదేశం
అన్నివర్గాలవారకిి విభిన్న కులాలవారికి మతాలవారికిది ఆవాసం
పెరుగుతుంది కలుపుగోలుతనం
భిన్నత్వంలో ఏకత్వం ఇదే ఇదే మన ఆదర్శం
"శ్రీ "హనుమానుని దివ్య
"
మ" హిమలను పద్యాలుగా అ
"
తి " క్కని పదాలతోకూరుస్తూ,పవన సుతుని
"
నా" మమును అహరహం తలుస్తూ,
"
గ " వంతునిపై భక్తిని,విశ్వాసాన్ని,అఖండ
"
జ్యో" తిలా ప్రజ్వలింప చేస్తూ,తనతో,
"
తి"గావర్తించేవారికి కలంబలం చూపుతూ అ 
"
ర" మరికలు లేని స్వచ్ఛమైన స్నేహ పరి
"
మ" ళాలను గుబాళింప చేస్తూ,ప్రతీ క్ష 
"
ణ"మూ కుటుంబ సభ్యుల బాగోగులు చూసే
మన "జ్యోతి"కి అచ్చంగా తెలుగువారి తరఫున నా తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి పుట్టినరోజులు ఎన్నెన్నో జరుపుకోవాలని,ఆయురారోగైశ్వర్యాలతో కుటుంబ సభ్యులతో కలకాలం పచ్చగా జీవించాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ
అమ్మ
డా.బి.ఉమాదేవి.
04 -04 2015
న్యస్తాక్షరి
"శ్రీ సీతా రాములకు వందనములు"
తేటగీతి మాలిక
'శ్రీ'కరంబిది సత్ఫలసిద్ధి గలది
'
సీ'త యనిశము జపియించు చిన్మయమ్ము
'
తా'రకమును శుభకరము తత్త్వమయము
'
రా'మ రామ రామ యనెడి నామజపము
'
ము'నిగణమ్ములు గోరెడు ముక్తిదమును
'
'త్త లెల్లను బాపు జపోత్తమమ్ము
'
కు'జయు దయజూపు దలచిన గూర్మితోడ
'
వం'దనము లన రాముని ప్రాపు దొరుకు
'
'నుజు రావణు పురి జేరి ధరణిజ గని
'
'గ మశోకము పై రామ నామ మెంచి
'
ము'రిసె హనుమయ్య సీత సమ్ముఖము నంది!
'
లు'ప్త శోకగతుల మర్త్యలోక మందు!
31/3/15

శుభోదయం.కుమారీశతకము:-
8
కం: జపములు, గంగాయాత్రలు,
దపములు, నోములును, దాన ధర్మంబులు, పు
ణ్యపురాణము పతిభక్తికి
నుపమింపను సాటిరాక యుండు కుమారీ! 
భావము:-ఓ కుమారీ! భార్యకు భర్తే ప్రత్యక్షదైవం కాబట్టి జపతపాలు, గంగా తీర్థయాత్రలు, నోములు, దానధర్మాలు, పుణ్యపురాణకథా శ్రవణాలు, మొదలగు పుణ్యకార్యాలన్నీ నీ భర్త తర్వాతే అని తెలుసుకో. కారణం, నీ భర్త పుణ్యంలో కొంత భాగంకు నువ్వు అర్హు రాలవయ్యావు కాబట్టి జ్ఞానమెరిగి మసలుకో. పతిభక్తి గొప్పదని తెలుసుకో.
వివరణము:పతియే ప్రత్యక్షదైవమనే విషయాన్ని నూరిపోస్తూ పతిసేవచేస్తే చాలుతీర్థయాత్రలాచరించినట్లు,దానధర్మాలు చేసినట్లని చెబుతూ పతిభక్తికి సాటియైనదేది లేదని వివరిస్తున్నారు.
31/3/15
శుభోదయం.కుమారీశతకము.
7.కం:దబ్బరలాడకు కదిమిన
బొబ్బలు పెట్టకుము మంచి బుద్ధిగలిగి యెం
దెబ్బెఱికముఁ బూనక కడుఁ
గొబ్బునఁ జిత్తమున వానిఁ గూర్పు కుమారీ!
భావము:-ఓ కుమారీ! అబద్ధాలు చెప్పకు. నీ భర్త కొట్టబోతే కేకలు పెట్టి అల్లరిపాలు కావద్దు. ఏ పనైనా అసహ్యించుకోక మంచిబుద్ధితో వెంటనే ఆయాపనులను నెరవేర్చు.
వివరణము:-అబద్దాలు చెప్పకు.భర్త ఆవేశంలో కొట్టబోతే అరచి నానాయాగి చేయకూడదని "కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుందనే" విషయాన్ని సున్నితంగా తెలియ జేస్తున్నారు.ఈ కాలంలో కొట్టడంలాంటివి చాలా వరకు తగ్గిపోయాయి.అది చాలా హేయమైన చర్య.
30/3/15

శుభోదయం.కుమారీశతకము.
6.కం: తిట్టిన దిట్టక, కొట్టిన
గొట్టక, కోపించెనేనిఁ గోపింపక, నీ
పుట్టినయింటికిఁ, బాదము
పెట్టినయింటికిని వన్నె పెట్టు కుమారీ!
భావము:-ఓ కుమారీ! నీ భర్త నిన్ను తిడితే, నువ్వు మరలా తిట్టకూడదు. కొడితే ఎదురు తిరిగి కొట్టకూడదు. ఒకవేళ నీ పై కోపగిస్తే, తిరిగి కోప్పడకు. పుట్టింటికీ, నీ అత్తగారింటికీ కీర్తి వచ్చేట్లు నడుచుకో!
వివరణము:-నువ్వెంత అంటె నువ్వెంత అనుకొనే ఈ కాలానికి సరిపోనిదీ పద్యం.కాని మనం కవి కాలానికివెళ్ళి ఆలోచించాలి.భర్త చేసే పనులు భార్య చేస్తూ పోతే ఇంట్లో రోజూ రచ్చలే.ఎవరో ఒకరు సర్దుకుపోతే ఆగొడవ/జగడం అక్కడే ఆగిపోతుంది.మధ్యవర్తులు,పంచాయితీలు,రాజీల అవసరమే రాకపోవచ్చునని కవి అభిప్రాయమై వుండవచ్చు.
29/3/15
కుమారీశతకము:-
5
కం :పతి పాపపుఁ బనిఁ జెప్పినఁ
బతిమాలి మరల్పవలయుఁ బతి వినకున్నన్
హిత మనుచు నాచరింపుము
మతిలోపల సంశయంబు మాని కుమారీ!
భావము:-ఓ కుమారీ! నీ పతి చెప్పిన చెడ్డపనులను వద్దని నెమ్మదిగా ప్రార్థించి, వారించి, ఆ పని మానేలా చేయాలి. నీ పతి వినకపోతే అంతా మన మంచికేనని, సందేహాలను వదిలి పనిని నిర్వర్తించాలి.
వివరణము :భర్త చేసే,చెప్పే చెడుపనులను నివారించాలి.చతుర్వధోపాయాలలో 'సామాన్ని'ఆశ్రయించాలి.వినకపోతే తెగేదాక లాగకుండా సర్దుకు పోవాలని కవిభావన.
28/3/15
శుభోదయం.అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
1.ఆ.వె: పంక్తిరథకుమార పట్టాభిరామయ్య
భక్తి తోడ గొల్తు భద్ర మొసగు
జాగు సేయ కయ్య జానకీ రామయ్య
కావు మయ్య వేగ కరుణ తోడ.
2ఆ.వె:లక్ష్మణుడిక యూర్మిళను నిద్ర బుచ్చియే
గొల్వ,పాదుకలను గొనె భరతుడు
మారుతి నిను గొల్చి మన్నన లందెగా
నెల్ల భాగ్య మబ్బు నిన్ను గొలువ
3.ఆ.వె:రామనామ మహిమ రమణి సీత కెరుక
శబర కాంత యైన శబరి కెరుక
పదము సోక తాను పడతియయ్యెనహల్య
గుహ్య మైన దిదియె గుహుని కెరుక.
4.ఆ.వె:మాయ లేడి కోరె మగువ యా వైదేహి
కూర్మి తోడ నేగె కోర్కె దీర్చ
మగువ యడలె గాదె మారీచు కేకచే
సీత వాంఛ దెచ్చె చిక్కు లెల్ల.
5.ఆ.వె:రామ నామ మెంత రమణీయమోగదా 
రహిని గూర్చు చుండు రమ్యముగను 
కొలువ నిపుడె రండు కోదండరాముని
కబురు లాపి రండు కాంత లార. 
ఉమాదేవి బల్లూరి.
28/3/15
సమస్య:-
*కంటి లోన నలక కమ్మ నయ్యె*
ఆ.వె: ఇంటి లోన పనులు నిబ్బంది నిడుచుండ
వంట పూర్తి కాక వనిత యుండ
కంట నలక బడగ కార్యముల్ దప్పగా
కంటి లోన నలక కమ్మ నయ్యె
శుభోదయం
4 .
కం: తెచ్చినఁ దేకుండిన నీ
కిచ్చిన నీకున్న మగని నెగ్గాడకు మీ
యెచ్చెము నీపైఁ దేలును
రచ్చల కామాట లెక్కు రవ్వ కుమారీ!
భావము:-ఓ కుమారీ! నీ మొగుడు నీకు పెట్టినా, పెట్టకపోయినా, తెచ్చినా, తేకపోయినా, అతనిని దూషించటం చాలా తప్పు. మగని తిట్టడం మగువకు మంచిది కాదు. ఐదవతనం హరిస్తుంది. అందరిలో అపహాస్యంపాలు కాక తప్పదు. కావునా, మొగుణ్ణి తిట్టకుండా ఉండటం మగువ విధి.
వివరణము :భర్తతెచ్చినా తేకపోయినా సర్దుకు పోయ
గుణం పెంపొందించుకోవాలనీ అప్పుడే సంసారం సజావుగాసాగుతుందని దూషణ మొదలు పెడితే రచ్చతప్ప ఒనగూడేదేమి లేదని కవి భావన.
27/3/15
శుభోదయం.
3. కం : ఆటల బాటలలోనే
మాటయు రాకుండన్ దండ్రి మందిరమందున్
బాటిల్లు గాపురములో
వాట మెఱిగి బాల! తిరుగ వలయున్ గుమారీ!
భావము:ఓ కుమారీ! ఆటపాటలయందు ఏ విధమైన పరుష వాక్యములు పలుకక, మాటపడక, పుట్తింట్లో ఉండేటపుడు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చే విధంగా నడచుకొనుము.
వివరణము:సాధారణంగా పిల్లలు ఆట పాటల్లో పౌటీ పడటం,పేచీపడటం సహజం.ఒక్కోసారి అది వికోపానికి దారి తీస్తుంది.అందుకే మాట పడకుండా,అనవసరంగా మాట్లాడకుండా వ్యవహరించాలనిి కవి సూచిస్తున్నారు.పుట్టినింట తల్లి్దండ్రులకు మంచిపేరు తేవాలి.అత్తగారింట్లో కూడా వాటమెరిగి మసలుకోవాలని కవి భావన.
దత్తపదులపై రెండు పద్యాలు 
నీరు నిప్పు నేల గాలి
1.
భారతార్థంలో
అ.వె: పాండు సుతుడు నేల పై నుండరాదంచు
నీరు లోన తోసె నేర్పు తోడ 
నిప్పు బెట్టి భీము నిర్జింప నెంచినా
బతికె గాలి చూలి భయము లేక.
2 సామాజికము
అ.వె: నీరు వలన గాదె నేటినాగరికత
నేల విస్తరించె నెల్ల యెడల
నిప్పు తోడ వండ నేర్చెను మనుజుండు
ఊపిరన్న గాలి ఉర్వి యందు.
2.కం: చెప్పెడి బుద్ధుల లోపల 
దప్పకు మొకటైన సర్వధర్మములందున్
మెప్పొంది యిహపరంబుల
దప్పింతయు లేక మెలగ దగును కుమారీ!
భావము:ఓ కుమారీ! నేను చెప్పే నీతులు సరిగా అనుసరించు. సర్వ ధర్మాలకు న్యాయం చేయి. ఇహపరాలలో నీతిగా జీవించుము.
వివరణము:-కేవలము ఇహలోక సాధనకే గాక పరలోక సాధనకు మూలమైనది ధర్మాచరణము.దానిని తప్పకూడదని చెబుతూ "ధర్మో రక్షతి రక్షతః"అనే విషయాన్ని కవి గుర్తు చేస్తున్నారు.
సమస్య:-
*మార్చి అంచనాల మార్చి వైచె *
ఆ.వె: జమయు ఖర్చు జూసి చాల లెక్కలగట్టి
పన్ను తగ్గు నట్టి బాట పట్ట
పండగొచ్చి చేతి పైకము ఖర్చాయె
మార్చి అంచనాల మార్చి వైచె.
శ్రీ
కుమారీ శతకము.
పక్కీవెంకటనరసింహకవి
పక్కీవెంకట నరసింహకవిచే రచింపబడిన ఈశతకము స్త్రీహితబోధినిగా చెప్పవచ్చును.
నాటికి నేటికి స్త్రీల కన్వయమయ్యే పద్యాలెన్నో ఇందులో వున్నాయి.కొన్నిపద్యాలు మాత్రము నేటికాలానికి అసందర్భంగా అన్పిస్తాయి.ముఖ్యంగా "స్త్రీవాదుల"లంగీకరించరు.మగవాడు వ్రాశాడు కనుక అలా వ్రాశాడనవచ్చు.కాని నాటి పరిస్థితుల కనుగుణంగా వ్రాసి యుండవచ్చును.అంతమాత్రాన నేను దీనిని సంపూర్ణంగా సమర్థిస్తున్నాననికాదు.విమర్శిస్తున్నానని కాదు.ఆ కవి వ్రాసిన పద్యాలను భావాలను గ్రహిద్దాం.
పూర్వం ఉమ్మడికుటుంబాలుండేవి.ఆడపిల్లలకు చిన్నవయసులోనే(రజస్వలకాక పూర్వమే )వివాహాలు చేసేవారు.ఈడొచ్చాక కాపురానికి అత్తారింటికి పంపేవారు.అక్కడ ఉమ్మడికుటుంబంలో మెలగాల్సిన తీరుతెన్నులనుగూర్చి ఓతల్ల తనబిడ్డకు చెప్పినట్లుగా కవి ఇక్కడ వివరిస్తున్నారు.
ఈకవీంద్రుడే మగవారికి సైతము వారు మెలగాల్సిన విషయాలను గూర్చి "కుమార శతకము"అనే శతకంలో వివరించాడు.
కొందరు మిత్రులకోరికపై ఈశతకము లోని పద్యాలను "స్వామి"వారి దయవల్ల భావ,వివరణలతో వ్రాయాలనుకొన్నాను.నేను ఇంతకు మునుపు శేషప్పకవి వ్రాసిన 'నరసింహశతకమును '
నా వ్యాఖ్యానముతో చదివిప్రోత్సహించిన మీరు ఆప్రోత్సాహాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ ఈ శతకపద్యాలను వివరించే ప్రయత్నం చేస్తున్నాను.(భయపడకండి రోజూ ఇంత పెద్ద వ్యాఖ్యానముండదు)
1.
కం:శ్రీ భూ నీళా హైమవ
తీ భారతుల శుభవతిగ నెన్నుచు స
త్సౌభాగ్యము నీ కొసగగ
లో భావించెదరు కుమారీ.
భావము:ఓ కుమారీ!శ్రీదేవి ,భూదేవి,నీళాదేవి,హైమవతి,భారతీ మొదలైన దేవతలు మంచి నడవడిక గల్గిన నీకు సకల శుభాలనొసంగి సత్సౌభాగ్యాన్ని ఇస్తారు.
వివరణము:మన సంప్రదాయం ప్రకారం మన భారతీయులు ఏపనినైనా శ్రీకారంతో ఆరంభిస్తారు.ః
అదేవిధంగా ఈశతకంలో తొలిపద్యం శ్రీకారంతోనే ఆరంభింపబడింది.శ్రీవిష్ణు పత్నులైన శ్రీ,భూదేవులు,నీళాదేవితో పాటు బ్రహ్మ దేవునిపత్ని భారతీదేవి,శివసతి హైమవతులు సౌభాగ్యాన్నిచ్చి ఆశీర్వదిస్తారంటూ కవి ఈశతకాన్ని అరంభిస్తున్నారు.
సమస్య:
*నీకై నే నీ నీడై రానా!*
ఆ కైకేయీ యాజ్ఞన్ మీ రే
కాకై యేలా కానన్, స్వామీ!
మీ కాంతన్ జుమ్మీ, మా రాజా!
*
నీకై నే నీ నీడై రానా!*

సమస్య --172
*
దాచు కొన్న దక్కు దాచి నంత *
దాన మొసగి నంత దక్కును పుణ్యంబు
దాని వలన పెరుగు దాత కీర్తి
కర్మ ఫలము దక్కు ధర్మనిరతులకు 
దాచు కొన్న దక్కు దాచి నంత
అందరికీ మన్మథనామ సంవత్సర శుభాకాంక్షలతో శుభోదయం. దైవస్తుతితో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిద్దామా !
"
మ" ల్లెలు మొల్లలు గూర్చి త
"
న్మ "యత్వము తోడ నీ కమ్మని క
"
థ "ల్ వాసిగ చెప్పుకొనుచు నీ శుభ
"
నా "మస్మరణము నిరంతరము చేతుము
"
మ "మ్ము కరుణించు మో స్వామీ శ్రీ
"
సం "కర్షణా లోకము నందలి సకల జీ
"
వ "రాశుల నెల్ల కరుణతో కాపాడు,
"
త్స "రములు తొలగించి మమత గూర్చి ప
"
ర "స్పరాభిమానములు పెంచి మ
"
ము "దీవించి దీర్ఘాయురారోగ్యంబులొసగు.
డా.బల్లూరి ఉమాదేవి.
సమస్య:--
*
హేచ్చు తగ్గు లెంచ హెచ్చె తగ్గు *
ఆ.వె:అన్నదమ్ము లందు ననవసరంబుగ
మాట మాట పెరిగి మనసు లదిరె
ఒకరి మాట లొకరు నోజగ పరికింప
హెచ్చు తగ్గు లెంచ హెచ్చె తగ్గు.
* శవపూజల వలన జన్మ సార్థక మౌగా! *
******************************************
*
పూరణ - Umadevi Balluri *
****************************************** 
నవనవ లాడెడు విరులను
దవనముతో గూర్చి సుమకదంబపు మాలన్
సవరించుచు భక్తిని కే
*
శవపూజల వలన జన్మ సార్థక మౌగా! *
సమస్య:-
*
అమ్మా బైలెల్లినాది యసురుల దునుమన్ *
కం:నెమ్మోమున కరుణను జిలు
కమ్ముఖమున రౌద్రరసము నల్లల్లాడన్
జిమ్మి కనకదుర్గమ్మగ
అమ్మా బైలెల్లినాది యసురుల దునుమన్
సమస్య:--33
*హాహా హూహూ నినాద మాకసమంటెన్ *
కం:ఆహా!యిది ప్రళయంబే
నూహించుటకౌ నసాధ్య ముర్విన్ గూలెన్ 
గేహాదులు బాధలతో
హాహా హూహూ నినాదమాకసమంటెన

అందరికీ శుభోదయం.తిథి ప్రకారం పుట్టినరోజు జరుపుకొంటున్న శ్రీ ఆలూరు కృష్ణప్రసాద్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో
"ఆ"దరంగా అరుణోదయవేళలో అందరిని ప
"
లు"కరిస్తూ శుభోదయ శుభాకాంక్షలను మ
"
రి"చి పోకుండా తెలుపుతూ భగవానుని
"
కృ"పా కటాక్ష వీక్షణాలు మనపై పడాలని కృ
"
ష్ణ"పరమాత్ముడాదిగా వారాల కనుగుణంగా 
"
ప్ర"తిమలకు మారుగా చిత్రపటాల నమర్చి అ
"
సా"ధారణ సూక్తులను సందర్భోచితంగా తెలిపే కృష్ణప్రసా
"
ద్"గారికి అచ్చంగా తెలుగు వారి తరఫున
జన్మదిన శుభాకాంక్షలు.
* పూరణ - Umadevi Balluri *
*****************************
అల్పవేతనమున నందమైన గృహము
కట్టుకొని వసించె కన్నతండ్రి;
కుడ్యముల మరుగున కోక మార్చుట కని
*
పడకగదుల గూల్చె వలువ దాల్చ!
సమస్య:--111
*
వనితయు కవితయు ప్రియముగ వలచుచు వచ్చున్*
అనిశము వాణీ మాతను
మనమున దలచుచు రచించు మాన్యుల జేరే
ననుమానము లేక సిరియు
వనితయు కవితయు ప్రియముగ వలచుచు వచ్చున్.
సమస్య:-218
*కలలే నిజమై తలపున కలువలు విరిసెన్*
కం:అలనాడా తరు ణీమణి
కలలో గాంచిన సురూపు కందర్ప సుతున్
చెలిసాయముతో జూడగ
కలలే నిజమై తలపున కలువలు విరిసెన్ .
సమస్య :-235.
*వేశ్య వలన కలుగు వెలుగు మనకు*
గాఢమైన మబ్బు కమ్మిన వేళలో
పక్కయింటి నుండి పర్వె కాంతి
మంచి మనసు గలుగు మాహితైషు లు నను
వేశ్య వలన కలుగు వెలుగు మనకు.
***
అనువేశ్య=ప్రక్కఇంటి యిల్లాలు.*
సమస్య
*గుణవంతుల వలన కొంప కొల్లేరౌగా*
క్షణమున కొకపరి సతిస
ద్గుణముల నిందించెడి గుణదూరులు నిష్కా
రణముగ నేడ్పించెడిదు
ర్గుణవంతుల వలన కొంప కొల్లేరౌగా.
హోలీ
చిన్నపెద్దా
పేదా గొప్పా
ఆడా మగా
అనే తేడా లు లేకుండాందరు ఆనందంతో సంబరంగా రంగులు జల్లుకొని ఆడే ఆట హోలి.దీనికి సంబంధించి మూడు కథలు ప్రచారంలో ఉన్నాయి.
1
కామదహనం : అందరికి తెలిసిన కథే ఐనా మరొక్కమారు హోలి సందర్భంగా గుర్తు చేసుకొందాం.
దక్ష యజ్ణంలోతండ్రియింట జరిగిన అవమానం వల్ల ఆత్మత్యాగం చేసుకొన్న సతీదేవి మరల మేనా హిమవంతుల కూతురుగా జన్మిస్తుంది పర్వతరాజ పుత్రి కనుక పార్వతి అనే పేరుతో పిలువబడుతూ వుంటుంది త్రిలోకసంచారి యైన నారదుని మాటలను బట్టి శివుని తన భర్తగా నిర్ణయించుకొని వుంటుంది అక్కడ పరమశివుడుకూడా సతీదేవి విరహంతో అట నుండలేక హిమాలయాలకొచ్చి తపస్సు చేస్తుంటాడు. తారకాసుర సంహారార్థం దేవతల కోరికపై తపోభంగం చేయడానికి మన్మథుడొస్తాడు. ఆ ఆలు మగలను కలపడానికి వచ్చిన మన్మథుడు శివుని కోపాగ్నికి మాడి మసై పోతాడు. ఆతని భార్య రతీదేవి ప్రార్థన వల్ల మళ్ళీ బ్రతికినా అనంగుడై అందరిలో ప్రేమభావాలు కల్గిస్తూ రతీదేవికి మాత్రం అగుపిస్తుంటాడు. భౌతికమైన ప్రేమ కంటే మానసికమైన ప్రేమే గొప్పదని తెలిపే వృత్తాంతమిది.మన్మథునకు కాముడనే మరో పేరుంది. మన్మథుడు దహనమైన రోజు కనుక కామదహనం జరుపుకోవడం జరుగుతుంది.
2 రాక్షసరాజైన హిరణ్యకశిపుని సోదరి హోలిక.ప్రహ్లాదుని చంపడానికీమెను ప్రయోగిస్తాడా రాక్షస రాజు.కాని శ్రీ హరిదయవల్ల ఆమెచేతిలో మరణించక పోగా ఆమే ఆ అగ్నికి ఆహుతై పోతుంది. ఆ హోలిక పేరు మీదుగా హోలి పండుగ జరుపబడుతూ వుంది.
3
ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగించిన కృష్ణుడు గోపికలతో రంగులు చల్లుకొని ఆడి పాడి ఆనందించిన రోజు. అందుకే హోలీ అనగానే రంగుల పండగ అని గుర్తొస్తుంది.ఉత్తర భారతదేశంలో హోలీ పండగను గొప్పగా చేసుకొంటారు.
భారతీయులు జరుపుకొనే ప్రతి పండుగకు అర్థము పరమార్థము ఉండే వుంటుంది ఆచారాల వెనుక సాంకేతిక కారణము కూడా వుండే వుంటుంది.
శిశిరం తరువాత వచ్చే వసంత ఋతువులో వాతావరణంలోని మార్పులవల్ల కొద్దిపాటి అనారోగ్యం సంభవించడం సహజం. సహజమైన రంగులు రంగుల పొడులు ఔషధంగా పనిచేస్తాయని పూర్వీకులు బలంగా నమ్మేవారు. ముఖ్యంగా నిమ్మ పసుపు కుంకుమ మారేడు మోదుగ మొదలైన వాటితో వనమూలికలు తయారు చేసుకొనేవారు. వాటితోనే రంగులు చేసుకొనేవారు.పండుగలలో ఐ సహజమైన రంగులనేవాడేవారు.
కాని నేటి కాలంలో అన్నింటిలాగే రంగుల్లో కూడా కల్తీలే పెరిగిపోతున్నాయి.అచ్చమైన రంగులకు బదులు రసాయనిక రంగులను వాడడం వల్ల చర్మరోగాల బారిన పడుతున్నారు.కల్తీలను నివారిద్ద్ద్దాం 
సహజమైన రంగులువాడి మనలను మన పరిసరాలను కాపాడుకొందాం.
మొత్తం మీద ఇటువంటి పండుగల వల్ల ప్రజలలో సోదర భావం సౌభ్రాతృత్వం పెరుగుతాయి.సామరస్యానికి ప్రతీకగా చే సుకొనే ఐ పండుగను ఆదరంతో ఆనందం తో ఆహ్వానిద్దాం.
డా.ఉమాదేవి బల్లూరి 5/3/15
సమస్య:-
* రమ్ము తోనె వచ్చు రాజ గుణము*
ఆ.వె:జగతి యందు గలరు జనులు త్రిగుణములన్
సజ్జనుండు బొందు సత్త్వ గుణము
తమము వలన గలుగు తామసం బిల,నోగి
రమ్ము తోనె వచ్చు రాజ గుణము.
సమస్య :-
*
ఆటవెలది తప్ప అన్య మెరుగ
*
ఆ.వె:మాతృ భాష యందు మమత పెరిగెగాని
కంద పద్య మందు కాంక్ష లేదు
పాఠకుండు మెచ్చు పద్యరాజమిదియె
ఆట వెలది తప్ప అన్య మెరుగ
సమస్య:-
*రమ్ము తోడ రాముని మందిరమ్ము నిండె*
తే.గీ:రామనవమి నాడట జేరి రమణులంత
తోరణమ్ముల భక్తి విస్పారమంద
రంగ వల్లులు దిద్ది తీర్చంగ సంబ 
రమ్ముతోడ రాముని మందిరమ్మునిండె
సమస్య:-218
*కలలే నిజమై తలపున కలువలు విరిసెన్*
కం :అలనాడా తరు ణీమణి
కలలో గాంచిన సురూపు కందర్ప సుతున్
చెలిసాయముతో జూడగ
కలలే నిజమై తలపున కలువలు విరిసెన్ .
సమస్య:-
*
కాకి కాకి కాక కేకి యగునె*
కుత్సితులకు నెంత కూరిమి జూపినా
మంచిబాట విలువ నెంచ బోరు
వాయసమునకు పలు వర్ణము లద్దినా
కాకి కాకి కాక కేకి యగునె!
సమస్య::-
*
ఉల్ముఖమది తీర్చె నూరి తగవు*
కారు మబ్బు ముసిరి గాఢ తిమిరమొప్ప
పనికి నేగినట్టి పల్లెపడుచు
'
లెటుల నిల్లు చేర నేది దా'రనుచుండ
ఉల్ముఖమది తీర్చె నూరి తగవు.
ఓంనమశ్శివాయ.
కైలాసవాసుడవు నగజాత కీశుడవు
మనోనియామకుడవు మనసిజు హర్తవు
నీదు యాఙ్ఞ లేక చీమైన కుట్టదట
అసుర వరులకెల్ల అభయ ప్రదాతవట
లయకర్తవూ నీవె లాస్య ప్రియుడ వీవె
సితికంఠుడవీవె భసితాంగుడ వీవె
అర్ధనారీశ్వర తత్త్వం అఖిీల జగతికి మూలం
నీమాట జవదాటి దాక్షాయణీ దేవి
దక్షయఙ్ఞ మందె దగ్ధ మయ్యె 
పశుపతియె పతియంచు మదికోరి
పర్వతాధిపు సుతగ యవతరించె
అనుక్షణము నినుకోరి ఘోరాటవి చేరి
అహరహము నినుగొల్చి ఉపవాసదీక్షతో
ఆకులలములు దినక అపర్ణ తానయ్యె
నినుచేరి యామాత జగజ్జనని యయ్యె
ఫాలము నిలవంచి నీకు మ్రొక్కులిడుదు
ఫాలనేత్రము తోడ పాపాలు దహియించు
ప్రసన్నవదనాన ఆశిస్సులందించు
నతులు నుతులర్పింతు హరహర మహదేవ
||
ఓం శాంతి శాంతి శాంతిః ||
సమస్య:216
*
వగలాడి కినుకను మాన్ప వశమే ఔరా*
తే.గీ:జగడము లాడెడి శ్రీమతి
మొగమున గలయలుక దీర్చ మురిపెముతో నో
నగ నామె మెడను వేయక
వగలాడి కినుకను మాన్ప వశమే ఔర

శంకరాభరణం
న్యస్తాక్షరి; 61చం‌‌ ద మా మ
చంద్రుడపహసింప చయ్యన కోపించి
దర్శనమ్ముచేతదప్పు లొదవు
మాట కాదు శాపమనియె నాగణపతి
మరుని పితకు బావ మరిది వీవె.
ప్రేమంటే
ప్రేమంటే అనురాగం
ప్రేమంటే మమకారం
ప్రేమంటే అభిమానం
ప్రేమంటే అనుబంధం
ప్రేమకు లేదు "రోజు"
రోజు మాత్రమే వుండేదైతే
అది కానేకాదు ప్రేమ
ప్రేమకు ఏదీ కొల మానం
పెంచేకొద్దీ పెరిగేది ప్రేమ
పంచేకొద్దీ పెరిగేదీ ప్రేమే
అమ్మకు లేదా ప్రేమ?
అబ్బది కాదా ప్రేమ?
అందరిదీ ప్రేమే 
అందుకే 
చేయకండి ప్రేమను పరిహాసం
పెట్టకండి ప్రేమను పరీక్షకోసం
ప్రేమంటే
కన్నవారిని కష్టపెట్టేదికాదు
ప్రేమంటే
కాదు ఆకర్షణ కాదు వ్యామోహం
కడదాక కన్నవాళ్ళ దగ్గర దొరికేది ప్రేమ
ఆలుమగలుగా కలకాలం వుండేది ప్రేమ
నొప్పంచకుండా ఒప్పించేది ప్రేమ
నిత్యనూతనమైనది ప్రేమ
నిలుపు కోవాలి దాన్ని కలకాలం.
Top of Form

సమస్య : 191
*
వగలాడికి వంక జెప్ప వరదుడి వశమే *
కం:మగనిని గోముగ నడిగెను
నగలను చేయించు మనుచు నారీమణి, తే
రగ డబ్బు గడించక నిక
వగలాడికి వంక జెప్ప వరదుడి వశమే!:
సమస్య::- 204
* వెలది కౌగిట చిక్కెనా వింత యోగి *
తే.గీ:పదును తోడవా డిగనున్న పద్యములను
చక్కని పదాలతో గూర్చి చదువరులను
వశపరచు కొన్న యా కవి వరుడు యా(ఆ)ట
వెలది కౌగిట చిక్కె నా వింత యోగి
,,ష లు రాకుండా వాస్తు దోషము గురించి సాహిత్యం గ్రూప్ లో ఇచ్చిన నిషిద్ధాక్షరికి నా పూరణ.
ఆ.వె:కొత్త ఇంటి యందు కొడుకుకో డలు కీచు
లాడుచుండ తండ్రి యాలకించి
చిన్నమార్పు చేత చిక్కులెల్లవోవు
నిమ్మళమ్ము గల్గునిజము ననియె
సమస్య:-194
*
గోటి నరికి వేయ గొడ్డ లేల
ఆ.వె:ఆలుమగల నడుమ గాలివాన కురిసె
చిలికి చిలికి- చిన్న చిక్కు ముదిరి;
సామరన్యముననె సమసె సంఘర్షణ:
*
గోటి నరికివేయ గొడ్డ లేల!
సమస్య:-
* పుస్తకమును తెరువ బువ్వ కరువె *
ఆ.వె:తాము కష్ట పడుచు తనయుల జదివింప
కూడ బెట్టినారు కూలి చేసి
పక్కదారి బట్టి పాఠ్యముల్ జదవక
పుస్తకమును తెరువ బువ్వ కరువె.
సమస్య:-
*
స్వామి భక్తిని వీరికి సాటి గలరె*
బాలభక్తుడు ధ్రువుడు తపంబు జేసె
తండ్రి యంకము గోరగ - తార యయ్యె;
హరిని ద్వేషించ తండ్రి- ఫ్రహ్లాదు డడ్డె;
*
స్వామిభక్తిని వీరికి సాటి గలరె!
సమస్య :183
*స్వామి గొలువ హనుమ సాటి గలరె.
ఆ.వె:రావణు సుతు తోడ రణమొనర్చెడి వేళ
రామచంద్రు మోసె ప్రగ్రహమున
జయము నొంది కలువ జానకీ రాములు
స్వామి గొలువ హనుమ సాటి గలరె.
సమస్య:-
*గోరు ముద్ద దినగ గోరె బామ్మ.
ముద్దు మాట లాడి ముప్ప తిప్పలు బెట్టు
బాలుఁజూచి తల్లి బ్రతిమలాడ
పాలు తాగ ననెడి పౌత్రుని ,తనచేతి
గోరుముద్ద తినగ గోరె బామ్మ.
సమస్య:-
*
కన్నె మది నెంచ నంతయు కల్ల గాదె
తే.గీ:పట్టుపరికిణి గట్టిన పసిడిబొమ్మ,
ముట్టుకున్నంత మాసెడు మోహనాంగి,
పగటి కునుకున గనిపించి వగలు చిలుకు
కన్నె, మదినెంచ నంతయు కల్ల గాదె!

సమస్య:
*
కన్నె,మది నెంచ నంతయు కల్లగాదె
తే.గీ:పట్టుపరికిణి గట్టిన పసిడిబొమ్మ,
ముట్టుకున్నంత మాసెడు మోహనాంగి,
పగటి కునుకున గనిపించి వగలు చిలుకు
కన్నె, మదినెంచ నంతయు కల్ల గాదె!

సమస్య:161
*
మింగ నన్నమేల మేలె మందు.
ఆ.వె: చలిగ నున్నవేళ చల్లని నీరమ్ము
గ్రోలి మాట లాడ గొంతు బిగిసె
జలుబు పట్ట కొంత జఠరాగ్ని చల్లారె
మింగ నన్న మేల మేలె మందు.
సమస్య:161
*
మింగ నన్నమేల మేలె మందు.
ఆ.వె: చలిగ నున్నవేళ చల్లని నీరమ్ము
గ్రోలి మాట లాడ గొంతు బిగిసె
జలుబు పట్ట కొంత జఠరాగ్ని చల్లారె
మింగ నన్న మేల మేలె మందు.
సమస్య :-154.
*
ఎత్తు మడమ చెప్పు లొత్తు కాళ్ళు.
పొట్టి దాన ననుచు పొడగరిఁగాదని
దిగులుఁజెంద నీకుఁ దగదు వినుము
ఎదుటి వారి కొరకు ఎత్తు చెప్పులుదాల్చ
ఎత్తు మడమ చెప్పు లొత్తు కాళ్ళు.

ఆశ లెక్కు వయ్యె నాస్తు లెల్ల కరిగె
అప్పు లెక్కు వయ్యె నవని యందు
బ్రతుకు తెరువు కన్న రంగు మోజులు హెచ్చె;
*
కూటి కఱవు మించు కోర్కె లెన్నొ!
* పూరణ - Umadevi Balluri *
************************************
నేటి భావిపౌరు లాటపాటల యందు,
వెకిలి పనుల పట్ల వెఱ్రి పెరిగె;
పెద్ద వారి పర్యవేక్షణ లేదుగా:
*
కాల మహిమ దెలియ గలరె ఘనులు!
ఆశ లెక్కు వయ్యె నాస్తు లెల్ల కరిగె
అప్పు లెక్కు వయ్యె నవని యందు
బ్రతుకు తెరువు కన్న రంగు మోజులు హెచ్చె;
*
కూటి కఱవు మించు కోర్కె లెన్నొ!
సమస్య:128
*
కూటి కఱువు మించు కోర్కె లెన్నో
ఆ.వెఆశ లెక్కు వయ్యె నాస్తు లెల్ల కరిగె
అప్పు లెక్కు వయ్యె నవని యందు
బ్రతుకు తెరువు కన్న రంగు మోజులు హెచ్చె;
*
కూటి కఱవు మించు కోర్కె లెన్నొ!
సమస్య :-154.
*
ఎత్తు మడమ చెప్పు లొత్తు కాళ్ళు.
పొట్టి దాన ననుచు పొడగరిఁగాదని
దిగులుఁజెంద నీకుఁ దగదు వినుము
ఎదుటి వారి కొరకు ఎత్తు చెప్పులుదాల్చ
ఎత్తు మడమ చెప్పు లొత్తు కాళ్ళు.


No comments:

Post a Comment