అంశం:లక్ష్మి
ఆ.వె:జయము జయము లక్ష్మి జయము నొసగుమమ్మ
విడువక నిను గొలుతు విష్ణు పత్ని
కొలుచు వారికీవు కొంగు బంగారమే
కావుమమ్మ మమ్ము కమలనేత్రి.
ఆ.వె: వరము లొసగు నట్టి వార్ధితనయ వీవె
హరికి సతివి నీవు హరుషమొసగు.
సతము కొలుతు మమ్మశర్వాణి,శ్రీలక్ష్మి
చల్లగ మము కావు జగతియందు.
ఆ.వె: సిరుల నొసగు తల్లి శ్రీదేవి నిను గొల్తు
కోర్కె దీర్చ వమ్మ కూర్మి తోడ
వరము లొసగు నట్టి వరలక్ష్మివే నీవు
వెతలు దీర్చి మాకు వేడ్క నొసగు.
ఆ.వె: శుక్రవారమందు సుదతులెల్ల చేరి
యాచరింత్రు పూజ లనవరతము
కరుణ తోడ నమ్మ కామితార్థ మొసగ
వెల్లి విరియు నింట వింత శోభ.
ఆ.వె:సకల శుభము లొసగు సాగరతనయను
సుదతు లెల్ల జేరి సూక్త రీతి
కరుణ జూపు మంచు గానము చేయుచు
కోరి వ్రతము చేయ కోర్కె దీరు.
కం:అమ్మా భార్గవిజననీ
కొమ్మా పూజల సతతము కూరిమి తోడన్
యిమ్ముగ నిన్నే గొల్చెద
నమ్మాధవు తోడగూడి యభయమ్మిమ్మా.
ఆ.వె:పాలకడలి యందు ప్రభవించినావమ్మ
నాలివైతివి గద హరికి నీవు
సురలు మెచ్చ చుండ సుమమాల శ్రీహరి
గళము నందిడితివి కమల నేత్రి
ఆ.వె:హరికి సతివినీవు నభయప్రదాతవు
కొలుచు వారి మదిని కొలువు దీరి
యుందువమ్మ మాత యొప్పుగా సతతము
నిరుత మిలను జూపు నీదు కరుణ.
No comments:
Post a Comment