Tuesday, October 31, 2017

డా.A P J కలాం శ్రద్ధాంజలి

డా.A P J కలాం శ్రద్ధాంజలి.


"ఎ"రుక గలవారికీతడు దైవంబు
"
పి"ల్లలచే పెద్దలచే జనులందరిచే
"
జే"జేలు పల్కించుకొన్న ఆరాధ్య మూర్తి
"
అ"లుపెరుంగని నేత ;శత శతా
"
బ్దు"లు దాటినా మరువలేని మహనీయుడు కల
"
లు" కనమనితెల్పి అంతటితో నాగక 
"
క "లలను సాకారమొనర్చు కొనంగ 
"
లా"లిత్యము తోడప్రోత్సహించిన భరత మాత
"
ము"ద్దుబిడ్డ డితడు అందరము సవినయము
"
గా "నర్పింతుము రండు మిత్రులార వా
"
రి "నిండిన నేత్రములతోడ గద్గద స్వరమున వీరి
"
కి" శ్రద్ధాంజలి ఘటింతుమిచట.


అశ్రునివాళి:
మనదేశ ప్రథమ పౌరుడుగా నుండి వేలాది మందికి స్ఫూర్తి ప్రదాతగా నిల్చిన మహామనీషి భారతరత్న డా.APJకలాం గారు కీర్తిశేషులవడం బాధాకరమైన విషయం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమెరికాలోమేమున్న ఈ డల్లాస్ నగరంలో వున్న గాంధీ పార్క్ లోఈరోజు 27/7/15 రాత్ర 8 30 ప్రాంతంలో TV 5 మరియు తెలుగు అసోసియేషన్ వారు శ్రీ కలాం గారికి సంతాపసభ యేర్పాటు చేశారు.ఆ సభలో వారిని గూర్చి మాట్లాడే అవకాశం కల్గింది.వారిని గూర్చి నేను వ్రాసిన పద్యాలు వన్పించిన సంగతులు మిత్రలతో పంచుకోవాలని---------
ఆ.వె: భరతమాత గన్నభాగ్యవంతుడితడు
సాటి లేని మేటి శాస్త్ర వేత్త
విద్య పంచి నట్టి విఙ్ఞాన మూర్తిగా
యితని పొగడ తరమె యేరి కైన.
2.ఆవె: నింగి కెగసి నాడు నేడొక్క ధీశాలి 
కదలి సాగి నాడు ఘనత తోడ
స్వర్గ మందు పంచ శాస్త్ర విఙ్ఞానమ్ము
యరగినాడు వేగ నమర పురికి.
3.
ఆ.వె:.అంతరిక్షమందు నపురూపముగ వెల్గ
సాగినాడు గాదె సాధు శీలి
ఒదిగి వున్న కొద్ది ఎదుగు ననెడి రీతి
స్ఫూర్తి దాత యైన సూరి యితడు.
4.
ఆ.వె: భరత జాతి నోము ఫలమె యీధీశాలి
అలుపెరుగని యట్టి యమృత మూర్తి
విద్య నేర్వ మంచు విద్యార్థులకు దెల్పి
వారి మధ్య లోనె బాసె నసువు.

ప్రకృతి.

మిత్రులందరికీ శుభోదయం

శీర్షిక:ప్రకృతి.

ఆ.వె:పాడిపంటలున్న పల్లెటూళ్ళెల్లను
          పలకరించు జనుల పరవశాన
         ఇరుగు పొరుగు తోడ నింపైన ముచ్చట్లు
        ముదము కూర్చు చుండు మదికి నెపుడు.

ఆ.వె:అన్ని ఋతువు లందు నానందమొసగంగ
         చెలమ లోని నీరు సేద తీర్చ
         పిల్ల గాలి మదికి ప్రీతిని కూర్చగా
          ప్రకృతి కోరు జనుల బాగు సతము.

ఆ.వె:గగన మందు శశియు కనువిందు చేయంగ
        తారలెల్ల మురిసి తళుకు లీన
        సంతసాన ప్రకృతి సంబరమ్మును కూర్చ
         హితము కలుగు గాదె నిలను జూడ.

ఆ.వె:పచ్చనైన చెట్లు ఫలముల నివ్వంగ
        చల్లగాలి మదికి చలువ గూర్చ
        ప్రకృతి యెల్ల హాయి పంచుచు నుండంగ
         అంతు లేని హర్ష మావరించు.

ఆ.వె:తరణి కిరణముగని తామరలు విరియు
        గగనమున శశిఁ గని కలువ విరియు
         తరువు లొసగు చుండు ధరలోన ఫలములు
         పరవశింప చేయు ప్రకృతి యెపుడు.

గాంధీజీ,శాస్త్రీజీల జన్మదినం.

అంశం:గాంధీజీ,శాస్త్రీజీల జన్మదినం.

వారిరువురికి జేజేలు పలుకుతూ
 గాంధీజీ
ఆ.వె:పోరు బందరందు పుత్లిబాయికితడు
     పుత్రుడై జనించె పుడమి యందు
     జగతి మెచ్చు నట్టి జననేత తానయ్యె
     సన్నుతించ బడియె జాతిపితగ.

ఆ.వె:మొక్కవోని దీక్ష ముదమున చేపట్టి
      ముష్కర మ్ము నడిపె ముందు నిలిచి
     సత్యవాక్యమునకు చాలప్రాధాన్యత
     నిచ్చి యాచరించె నిలను తాను.

ఆ.వె:భరత మాత యొక్కబానిస సంకెళ్ళు
       త్రెంచ నెంచి తాను తీవ్రముగను
      కృషిని చేసి కారగృహము కేగిన యట్టి
     దిట్ట యితడు గనుడు దేశప్రేమి.
 
ఆ.వె:భరతజాతియొక్క బానిసత్వము బాప
        నవని యందు తాను నవతరించె 
        తెల్ల దొరల తోడ తెలివితో పోరాడి
        వెలుగు బాట చూపి విజయు డయ్యె.

ఆ.వె: శాంతి శాంతి యనుచు శాంతిమంత్రము తోడ
        జయము గల్గ చేసె జాతి కితడు
       సకల జనులు మెచ్చ జాతికి పితయయ్యె
       కొత్త దారి చూపె కువలయాన.,

శాస్త్రీజీ.

ఆ.వె:పంతులింటి యందు ప్రభవించె నీతడు
       పేదరికములోనె విద్య నేర్చె
        బాల్యమందె తండ్రి పరమపదింపగా
        తాతగారి యింట తాను పెరిగె.

ఆ.వె:మచ్చలేని నేత మహిలోన నీశాస్త్రి
       ప్రజల సొమ్ము తాక వలదటంచు
        హితవు తాను తెలిపె నింపుగా  జనులకు
        నాచరించి చూపె ననవరతము.

ఆ.వె:జాతి సతము తలచు జననేత శాస్త్రీజి
       మరువబోకు మెపుడు మహిని నీవు
        నీతి నియమములకు నేస్తమీతడటన్న
     నతిశయోక్తి కాద  నరయుడయ్య .

ఆ.వె:శాంతి ముఖ్యమనెడిసందేశ మొసగుచు
         దేశనేత యైన ధీరు డితడు
          పొట్టి వాడ యినను గట్టి వాడు యనెడి
          మెప్పు బడసినట్టి గొప్పనేత.                                             

ఆ.వె: జైకిసానటంచు జగతిలో రైతన్న
           గొప్పచాటె నెంతొ కూర్మి తోడ
            ఆత్మబంధువయ్యె నన్నదాతలకెల్ల
            కోటికొక్కరుంద్రు కువలయమున.                                       



ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్ వీడుచు
          నమరు లైరి వీర   లవని యందు
           వారు నడచి నట్టి బాట ననుసరించ
             వడిగ రండు మీరు  యడుగు లేయ.

లక్ష్మి



అంశం:లక్ష్మి 



ఆ.వె:జయము జయము లక్ష్మి జయము నొసగుమమ్మ

          విడువక నిను గొలుతు విష్ణు పత్ని

         కొలుచు వారికీవు కొంగు బంగారమే

             కావుమమ్మ మమ్ము కమలనేత్రి.



      ఆ.వె:  వరము లొసగు నట్టి వార్ధితనయ వీవె

              హరికి సతివి నీవు హరుషమొసగు.

             సతము కొలుతు మమ్మశర్వాణి,శ్రీలక్ష్మి

             చల్లగ మము కావు జగతియందు.

 


  ఆ.వె: సిరుల నొసగు తల్లి శ్రీదేవి నిను గొల్తు

           కోర్కె దీర్చ వమ్మ కూర్మి తోడ

             వరము లొసగు నట్టి వరలక్ష్మివే నీవు

                 వెతలు దీర్చి మాకు వేడ్క నొసగు.


ఆ.వె: శుక్రవారమందు సుదతులెల్ల చేరి

           యాచరింత్రు పూజ లనవరతము

         కరుణ తోడ నమ్మ కామితార్థ మొసగ

        వెల్లి విరియు నింట వింత శోభ.


ఆ.వె:సకల శుభము లొసగు సాగరతనయను

          సుదతు లెల్ల జేరి సూక్త రీతి

           కరుణ జూపు మంచు గానము చేయుచు

             కోరి వ్రతము చేయ కోర్కె దీరు.


కం:అమ్మా భార్గవిజననీ

     కొమ్మా పూజల సతతము కూరిమి తోడన్

      యిమ్ముగ నిన్నే గొల్చెద

      నమ్మాధవు తోడగూడి యభయమ్మిమ్మా.


ఆ.వె:పాలకడలి యందు ప్రభవించినావమ్మ

       నాలివైతివి గద హరికి నీవు

       సురలు మెచ్చ చుండ సుమమాల శ్రీహరి

       గళము నందిడితివి కమల నేత్రి


ఆ.వె:హరికి సతివినీవు నభయప్రదాతవు

       కొలుచు వారి మదిని కొలువు దీరి

      యుందువమ్మ మాత యొప్పుగా సతతము

      నిరుత మిలను జూపు నీదు కరుణ.

Thursday, October 26, 2017

అశ


శీర్షిక:”అశ”


ఆ.వె:ఎండి పోయినట్టి యీనేల యందున

        చిన్న మెలక పుట్టి సేదతీర్చి

        నటులె నాశ తోడ నవనిపై జీవించ

        పొంద వచ్చు ఫలము పుడమి యందు.


ఆ.వె:తప్పు జరిగె నంచు దానినే తలచుచు

        క్రుంగి పోకు మెపుడు కువలయాన

         బీడు భూమియందు విత్తు మొలక లెత్తి

         నటులె మంచి భావి నంద గలవు.


ఆ.వె:బ్రతుకు పైన నాశ బలముగా కల్గించు

        దీని నెపుడు గొనుము దివ్వె గాను

         కష్ట మొచ్చెననుచు కన్నీరు పెట్టక

        మంచి జరుగు ననెడి మాట నమ్ము.


ఆ.వె:పనికి రాని నేల పైచక్కనైనట్టి

       మొక్క యొకటి చూడు మొలకలెత్తె

       యాశ తోడ బ్రతుక నందించు ఫలమని

       మదిని నమ్ము మెపుడు మహిని నీవు.


ఆ.వె:భావి యందు సుఖము వచ్చి తీరు ననెడి

     చిన్న యాశ చాలు జీవితాన

     ఎండినట్టి నేల యిచ్చె గనుము మొక్క

      నింత కన్న సాక్ష్య మేది భువిని.



తే.గీ:విత్తును నెపుడో విత్తిన విశ్వమందు

       ఫలమ దిప్పుడు లభియించె వాసిగాను

        ఆశె మనిషికి నూపిరౌ ననవరతము

       వదల బోకు మయ్య వాంఛ నీవు.

Tuesday, October 24, 2017

నాగులచవితి

అంశం: నాగులచవితి




1తే.గీ:సర్ప దోషమున్ బాపగ జనులు కోరి

      కొలుచు చుందురు విడువక కువలయమున

       పిల్ల లను కావు మనుచును  చల్లగాను

      మ్రొక్కు లిడుదురు సతతము ముదము తోడ.


2కం:చలిమిడి ముద్దలు చేయుచు

   లలి తోడను పాములకిల లలనా ముణులున్

    పలు ఫలముల ముందు నిడుచు

    కొలుతురు కార్తీకమందు కూరిమి తోడన్.

3కం:దండమయా యహిరాజా

    దండమయా కద్రుతనయ దండము నీకున్

     దండిగ చలిమిడి నిడుదుము

     నండగమాకెపుడు నిడుము నాశిస్సులిలన్.


4ఆ.వె:పుట్ట చెంత చేరి బుద్ధిపూర్వకముగ

       పూజ లెల్ల సలిపి పూలు పాల

        తోడ నర్చనములు తోషము తోచేయ

        తుష్ఠినంది యహియు దోషమణచు.

5ఆ.వె: భారతీయు లెల్ల భక్తిభావము పూని

        సర్ప రాజుఁగొల్వ సౌఖ్యమబ్బు

         ప్రాంత భేద మనక పాలు,ఫలములతో

         నర్చన మొన రింతు రవని యందు.


6.ఆ.వె: నాగ పంచమి యని నాగదేవతఁగొల్వ

              శ్రావణంబు నందు సంభ్రమాన

            చలిమిడి మరి పాలు చక్కగా పోయుచు

               నిలను పాము గొల్తురింట వారు.


7.ఆ.వె: నాగుమయ్య పూజ నమ్మకమున చేయ

            తొలగు నలత లన్ని తుష్టి గలుగు

         కన్ను,చెవుల రుజలు కాకుండ కాపాడు

            జాగు యేల రండు జాయ లార.


8.ఆ.వె:వనిత లెల్ల చేరి వాసిగా పూజింప

         పుట్ట చెంత కేగి ముందుగాను

        పరమ భక్తి తోడ పాలును పోయుచు

        కరుణచూప మంద్రు కరము మోడ్చి.


9.ఆ.వె:మంచి సంతుకొరకు పంచమి నాడున

           వ్రతము లాచరింతు రతివలెల్ల

          గరుడుడుదయమందె ఘనమైన నీరోజె

           తల్లి దాస్యముడిపె ధరణి యందు.

Saturday, October 21, 2017

దీపావళీ & లక్ష్మీ స్తుతి.

అంశం:నరక చతుర్దశి

లోక కంటకుడైన నరకాసురుని లోకపూజ్యుడైన శ్రీకృష్ణుడు సత్యభామా సమేతుడై వెళ్ళి విజయలక్ష్మితో తిరిగొచ్చాడుఇదియే "నరకచతుర్దశి" "దీపావళి" పండుగలుగా టపాకాయలు కాల్చి సంబరంగా చేసుకొంటున్నాము.

ఈసందర్భంగా  వ్రాసిన పద్యములు.

ఆ.వె:దైత్యు డొకడు నాడు దాచె ధరను నీట

      వాని జంపి హరియు వసుధ నెత్తె

     దాన సతియునయ్యె ధరణియు ముదమున

    పుట్టె నరకుడపుడె పుడమి యందు.

   

ఆ.వె:ధరణి కోరె పతిని తనయునొసగు మంచు

    నసుర సంధ్య వేళ యందు తాను

     నట్టి కోర్కె కూడ దనుచుహరియు పల్క

     పట్టు బట్టి పుత్రు బడసె నవని.


తే.గీ:అసుర బుద్ధిచే నెల్లర కనవరతము

      హింస లిడుచు నుండె నరకు డిలను సతము

    తల్లి చేతులందె తనకు మరణ ముండు

   నట్లు  పొందె వరము తాను నజుని వలన.


       ఆ.వె: వరముపేర్మి చేత వసుమతీ తనయుండు
       మగువలను మునులను మట్టుబెట్ట
       నెంచి వారి నెల్ల నిర్బంధమొనరింప
       వాసుదేవు డణచె వాని మదము.


ఆ.వె:అరి నొకపరి జూచు హరినొక పరిజూచు
       వాడి చూపు లనొక వంక వలపు
       జూపుల ప్రియ సఖుని జూచుచు మ్రోగించె
       సమర భేరి నపుడె సత్యభామ.


అ.వే:శౌరి తోడ నతివ సయ్యాట లాడుచు
       సంహరించె నరకుఁసత్యభామ
      నాటి నుండి నిదియే నరకచతుర్దశి
      పండుగయ్యె గాదె వసుధ యందు.



అంశం:దీపావళి.

ఆ.వె: అమవశి నిశి లోన అర్ధరాతిరి యందు
       అవని జనుల కెల్ల హర్ష మొదవె
       కాంతి పుంజమటుల కాంతులు వ్యాపించె
       పట్టపగలు వోలె ప్రభలు నిండె.


ఆ.వె:లక్ష్మి పూజ సేయ లలనా మణులు చేరి
          భక్తి పూర్వకముగ భజన చేసి
          కొలువ నపుడె యమ్మ కోరికల్ దీర్చుచు
        దీక్ష జూసి మురిసి దీవ నొసగు.


ఆ.వె:వణిజులుమరి వైశ్యులకెల్లను
        పెద్ద పండు గిదియె విశ్వమందు
        జమయు ఖర్చు లెంచి జయలక్ష్మిని గొలువ
        జయము నొసగు నంబ జంకు వలదు.


బలిపాడ్యమి.

శ్రీమహా విష్ణువు వామనుడిగా బలిచక్రవర్తివద్దకొచ్చి మూడడుగుల నేల వేడి త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించిన రోజు.
బలి పాడ్యమి సందర్భంగా  మూడు పద్యాలు.

కం:బలి యాగడముల నోపగ
     జాలము తండ్రీ,మురారి,జలజాక్షా,నీ
      జాలము తోడను వానిని
      బలహీనుని జేయుమంచు ప్రార్థించి రటన్.     1

ఆ.వె:సురల పల్కులెల్ల సుందరంబుగవిని
        వత్తు నేను మీకు వలదు భయము
         యనుచు దేవతలకు నభయంబు నొసగుచు
         వటువు గానె విష్ణు వటకు వచ్చె                   .

ఆ.వె:పొట్టి రూపు తోడ పుడమిని వేడంగ
       సర్వ మొసగె రాజు శంక లేక.
      బలిని యణచి యతని భార్యకు వరమిచ్చి
     కరుణ తోడ కాపు కాచి నావు.

ఈ రోజు కార్తీక శుద్ధవిదియ."యమ ద్వితియ"

అనికూడా అంటారు.అంటే యమధర్మరాజు తన సోదరి యైన యమున చేతు వంట తిని కానుకలొసగిన రోజు .'భగినీ హస్త భోజనం' గాప్రసిద్ధి చెందింది. ఇది దీపావళీ పండుగలో  భాగమయింది.

ఆ.వె:  యమున చేతివంట యద్భుతంబు యనుచు

          భగిని చేసినట్టి భక్ష్యములను

           ఆదరంబున దినె  యముడు నాడు నిదియె

                పండుగయ్యె గాదె వసుధ యందు.