Friday, July 19, 2019

Sreenivasa satakam

] Dr Umadevi B: శ్రీనివాస శతకము.
శ్రీవెంకటేశాయనమః
శ్రీ గురుభ్యోనమః
శ్రీరామదూతాయనమః
శ్రీ బనశంకరీ జననీ విజయతే.

1ఆ.వె:శ్రీగణేశ నినిట చేరికొలుతునయ్య
 శ్రేయములను కూర్చు శీఘ్రముగను
విఘ్నములను బాపి వేగకరుణజూపు
శేషగిరి నివాస శ్రీని వాస.


1.ఆ.వె:గౌరి దేవి సుతుని కొలుచుచు భక్తితో
        వ్రాయబూని తేను వాంఛతోడ
        వేదవేద్యుడైన వెంకటేశు చరిత
       శేషగిరి నివాస శ్రీని వాస.

2.ఆ.వె:భక్తి పూర్వకముగ భారతి నర్చించి
        నాటవెలదులందు నజుని పితను
        కూర్చ దలచి తేను కూర్మితో దయచూపు
           శేషగిరి నివాస శ్రీని వాస.
        
3.ఆ.వె:ఆంజనేయ నిన్ను ననవరతము గొల్తు
         కరుణ చూపవయ్య కపివరిష్ట
          శతకమొకటి వ్రాయ సంకల్పము గలిగె
              శేషగిరి నివాస శ్రీని వాస.

4.ఆ.వె:కలియుగమున వెలసె కల్పవృక్షము వలె
         మంత్రమందిరమున మానుగాను
         సద్గురు దయచేత చక్కగ వ్రాసెద
             శేషగిరి నివాస శ్రీని వాస.

5.ఆ.వె:దాసజనుల బ్రోవ ధరణిలో సతతము
         నవతరించెదవుగ నాది దేవ
          మీదు మహిమ లెరుగ మేమెంత వారము
             శేషగిరి నివాస శ్రీని వాస.

6.ఆ.వె:సాధుజనుల కావ సప్తగిరులయందు
          వెలసినట్టి స్వామి వెంకటేశ
            సతము నిన్నె గొలుతు సప్తగిరీశుడా
               శేషగిరి నివాస శ్రీని వాస.

7.ఆ.వె:మ్రుచ్చలించె నొకడు ముందుగా వేదముల్
           వేధ కొసగ నెంచె విష్ణువపుడు
            మరలి దెచ్చి యిచ్చె మత్స్యరూపముతోడ
                శేషగిరి నివాస శ్రీని వాస.

8.ఆ.వె:దేవదానవులును దివ్యామృతమునకై
          సాగరమ్ము చిలుక చక్కగాను
            కూర్మ రూపు తోడ కుధరము దాల్చిన
                  శేషగిరి నివాస శ్రీని వాస.

9.ఆ.వె:సుధను సక్రమముగ సురల కొసగనెంచి
            పడతి రూపు దాల్చె వసుధఁహరియు
            మురిసిరందరచట మోహినిన్ గాంచుచు
               శేషగిరి నివాస శ్రీని వాస.

10.ఆ.వె:దితి సుతుండు తాను దివిజులను జయించి
              వార్ధి యందు దాచె వసుధ నపుడు
               వరహరూపు తోడ వసుధను గాచిన
                    శేషగిరి నివాస శ్రీని వాస.

11.ఆ.వె:హరియు లేని తావు నవనిలో లేదంచు
             సుతుడు పల్క నలిగి చూపు మనగ
              నుద్భవించితీవు నుగ్రరూపము తోడ
                   శేషగిరి నివాస శ్రీని వాస.

12.ఆ.వె:శతక్రతువులొనర్చి శచిపతి స్థానమున్
              పొందగోరినట్టి పుడమిపతిని
              యణచి శక్రు గావ నవని వామనుడైన
                 శేషగిరి నివాస శ్రీని వాస.       

13.ఆ.వె:తరణి వంశమందు దాశరథిగ బుట్టి
             మునిమఖమును గాచి ముదము తోడ
              శివుని విల్లు విరిచి సీతఁపెండ్లాడిన
                      శేషగిరి నివాస శ్రీని వాస.

14.ఆ.వె:తండ్రి యాన మేర తల్లిని చంపగన్
             మురిసి తండ్రి వేడు వరమనంగ
            జనని వలయునంచు జమదగ్ని నడిగిన
              శేషగిరి నివాస శ్రీని వాస.

15. ఆ.వె:వాసుదేవు డనగ వసుధలో జనియించి
             గోపికల మనమున కూర్మి నింపి
              రాసలీల నాడి రహిని కూర్చిన దేవ
                   శేషగిరి నివాస శ్రీని వాస.

16.ఆ.వె:ఖలుడు వలువ లూడ్వ కంసారి నిను గొల్వ
             కోకలొసగి నావు కూర్మి తోడ
              మానము నిల కాచి మానినన్ బ్రోచిన
                 శేషగిరి నివాస శ్రీని వాస.

17.ఆ.వె:భాగ మొసగ కుండ పాండు సుతులతోడ
              కయ్య మాడ నెంచె కౌరవుండు
               సారథివయి నావు సవ్యసాచి కచట
                    శేషగిరి నివాస శ్రీని వాస.

18.ఆ.వె:కుటిల బుద్ధితోడ కురుపతి పంపున
              వచ్చె నత్రి సుతుడు వనములకును
               నపుడె యాకలనుచు నతివను కోరిన
                   శేషగిరి నివాస శ్రీనివాస
19.ఆ.వె:తండ్రి మాట  నిల్ప ధరణిని విడనాడి
             సాగినావు గాదె సతియు కూడి
             యనుసరించెనంట ననుజుడౌ సౌమిత్రి
                శేషగిరి నివాస శ్రీనివాస.

20.ఆ.వె:కనక మృగము కోరె కాననంబున సీత
              మారు పల్కకుండ మగువ కోర్కె
               దీర్చ తరలి నట్టి దేవదేవుడవీవె
                 శేషగిరి నివాస శ్రీనివాస.

21.ఆ.వె:తండ్రి మాటలెపుడు తనయులు వినవలె
               ననెడి లోకరీతి నవని యందు
               నెరుక పరచి తీవు నినకులాంబుధి సోమ
                 శేషగిరి నివాస శ్రీనివాస.

22.ఆ.వె:శబరి యొసగినట్టి చక్కనిఫలముల
            నారగించితీవు నవనియందు/నప్రమేయ
               ముదము తోడ తనకు ముక్తిని యొసగిన
                    శేషగిరి నివాస శ్రీనివాస.

23.ఆ.వె:పుణ్యమేమి చేసె పుడమిలో నీప్రాణి
              అల్ప సేవ జేయ నధిక భాగ్య
               మబ్బె!భక్తులందు నధిక ప్రేమను చూపు
                 శేషగిరి నివాస శ్రీనివాస.

24.ఆ.వె:విషము నొసగ నెంచి వెలది రూపముతోడ
              దుష్ట పూతనచట దుగ్ధ మొసగి
              పాలతోడ నతివ ప్రాణముల్ గ్రోలిన
               శేషగిరి నివాస శ్రీనివాస.

25.ఆ.వె: పిడికెడటుకులొసగ ప్రేమతో గైకొని
           భూరి సంపదిచ్చి పుడమిలోన
             బ్రోచినట్టి దేవ పుండలీక వరద
               శేషగిరి నివాస శ్రీనివాస.

26.ఆ.వె:పతియు శాప మొసగ పడతి శిలగ మారి
              వగచు చుండెను తాను వసుధ యందు
               నీదు పదము సోక నింతియు తానయ్యె
                    శేషగిరి నివాస శ్రీనివాస.

27.ఆ.వె:పాలసాగరమున పడతి రుక్మిణి తోడ
              సరస భాషణములు సలుపు చుండ
              కరుణజూపు మన్న కరిరాజు బ్రోచిన
               శేషగిరి నివాస శ్రీనివాస.

28.ఆ.వె:శేష తల్పమందు శ్రీదేవితోనుండ
              నతివ ద్రౌపది మొర లాలకించి
                వలువలొసగినట్టి వాసుదేవుడవీవె
                  శేషగిరి నివాస శ్రీనివాస.

29.ఆ.వె:కన్నతండ్రి సుతుని కష్టాల పాల్జేయ
               కావు కావు మనగ కంబమందు
                 వచ్చి కాచి నావు బాలప్రహ్లాదుని
                     శేషగిరి నివాస శ్రీనివాస.

30.ఆ.వె:సమర సంగమందు సారథి వైతివి
           భక్తి తోడ గొలుచు పార్థునకును
           గీత నెరుక పరచి గెలుపప నందించిన
              శేషగిరి నివాస శ్రీనివాస.

31.ఆ.వె:అతివ విరిని కోరి యలుకను బూనంగ
             విరుల తోడ నున్న తరువు దెచ్చి
               భామ కోర్కె దీర్చి పరతోష పరచిన
                        శేషగిరి నివాస శ్రీనివాస.

32.ఆ.వె:అర్ధరాత్రి యందు నవతరించితి వీవు
             గోప బాలుడనగ గోకులాన
            పెరిగి నావు గాదె వెన్న దొంగ యనగ
                 శేషగిరి నివాస శ్రీనివాస.

33.ఆ.వె:నలువ యుద్భవించె నాభికమలమందు
              మన్మథుండు పుట్టె మనసునందు
            తరము గాని పనులు ధరలోన నీకేవి
                    శేషగిరి నివాస శ్రీనివాస.

34.ఆ.వె:గోపకాంతల మది కొల్లగొట్టిన దేవ
               గొల్లభామ లిండ్ల గ్లోలి పాలు
               రాసలీల లాడి  రహిని గూర్చిన స్వామి
                      శేషగిరి నివాస శ్రీనివాస.

35ఆ.వె:గయుని మిషగ జేసి గాండీవి తోడను
              పోరు సల్పినట్టి పుణ్య పురుష
                 బవర మన్న నీకు బంతాటయే కదా
                        శేషగిరి నివాస శ్రీనివాస.
36.ఆ.వె:కరిని గాచినావు కరుణతో మొరలిడ
              కరిని చంపి మామ కంసు నణచి
               గోపబాలుర గూడి గోవులన్ గాచిన
                   శేషగిరి నివాస శ్రీనివాస.

37.ఆ.వె:కదన రంగ మందు కవ్వడి తెలియంగ
              విశ్వరూపమునట వేగ జూపి
               కదనమందు రక్తి కలుగ జేసిన యట్టి
                 శేషగిరి నివాస శ్రీనివాస.

38.ఆ.వె:పాదమందు పుట్టి పావన గంగయై
              యఘము బాపు చుండు నవని యందు
               నాలి యైన సిరియు నఖిలసంపదలిడు
                        శేషగిరి నివాస శ్రీనివాస.

39.ఆ.వె:జగతి నుద్ధరింప జనియించి పలుమార్లు
             దుష్ట రక్కసులను దునిమి నావు
               పుడమి జనుల చేత పూజలందెడి దేవ
                    శేషగిరి నివాస శ్రీనివాస.

40.ఆ.వె:వేద చోరు నణచి వేదాలు గొనితెచ్చి
           బ్రహ్మ కొసగి నట్టి పరమ పురుష
             కుధరమెత్తి వార్ధి కూర్మమై వెలసిన
            ( మందర గిరి మూపునందముగ దాల్చిన)
                  శేషగిరి నివాస శ్రీనివాస.

41.ఆ.వె:గురువు దక్షణ నడుగ కూరర్మితో మృతుడైన
             పుత్రునియొసగితివి పుడమి యందు
               నెంచ నీకసాధ్యమేమున్నదో దేవ
                   శేషగిరి నివాస శ్రీనివాస.

42.ఆ.వె:వెలది యలుక బూని వైకుంఠమును వీడి
              కొల్హపురము చేర  కొలువు వీడి
                 తిరిగి నావు గాదె దేశద్రిమ్మరివోలె/తింత్రిణీ వనమున
                       శేషగిరి నివాస శ్రీనివాస.

43.ఆ.వె:కాంత నిన్ను వీడ కానలో తిరుగుచు
               దారి తెన్ను లేక తపన చెంది
                పుడమి యందు నొక్క పుట్టను చేరిన
                      శేషగిరి నివాస శ్రీనివాస.

44.ఆ.వె:గగన రాజు యింట కమలజ యుండగ
             కోరి పెండ్లి యాడి కువలయాన
              నేడు కొండలకును నేలిక యైనట్టి
                  శేషగిరి నివాస శ్రీనివాస.
                
45.ఆ.వె:నీకు దుగ్ధ మొసగ నీరజభవుడొచ్చె
               వత్సమయ్యె తాను భవుడు కూడ
                చోళరాజు కమ్మె సుదతి గోవత్సముల్
                          శేషగిరి నివాస శ్రీనివాస.

46.ఆ.వె:కలియుగాన జనుల కాపాడు చున్నట్టి
              వెంకట పతి వీవె సంకటములు 
                 బాపి యభయ మొసగు వాడవీవే గదా
                             శేషగిరి నివాస శ్రీనివాస.

47.ఆ.వె:గరుడ వాహనుడవు కమనీయ మూర్తివి
              నిన్ను పొగడ తరమ నీరజాక్ష
                 వెంకటాద్రి పైన వెలసిన జేజివి/స్వామివి 
                         శేషగిరి నివాస శ్రీనివాస.

48.ఆ.వె:భక్త వత్సలుడవు భయనివారకుడవు
           నభయ మొసగు మంచు నార్తి తోడ
           కొలుచు భక్త జనుల కొంగుబంగారమే
                   శేషగిరి నివాస శ్రీనివాస.

49.ఆ.వె:వేడుకొందునయ్య వెంకటాచలవాస
             వేగ కరుణజూపు విశ్వపాల
                నేడు కొండలెక్క నేనసమర్థుడఁ
                     శేషగిరి నివాస శ్రీనివాస.

50:ఆ.వె:వాంఛితములు దీర్చు వాసుదేవుడ వీవె
              పదుమవతిని గోరి పరిణయమ్ము
                 నాడి వకుళ మాత కానందమొసగిన
                         శేషగిరి నివాస శ్రీనివాస.

51.ఆ.వె:ధరణి నేలు దేవ దర్శింప వచ్చితి
              కనులు గాన రావు కరుణజూపు
              వేగ కానుపించు వెంకటాధీశ్వరా
                    శేషగిరి నివాస శ్రీనివాస.

52.ఆ.వె:మూడు నామములను ముచ్చటగాదీర్చి
               మ్రొక్కు జనుల యొక్క ముడుపు లెల్ల
               ముదము తోడ గొనుచు మదమొసగెడి దేవ
                       శేషగిరి నివాస శ్రీనివాస.


53.ఆ.వె:విష్ణు మూర్తివీవె వేదగోచరుడీవె
                నలిగి నిన్ను వీడె నతివ లక్ష్మి
                సిరియు లేని చోట చిరకాల ముండని
                       శేషగిరి నివాస శ్రీనివాస.   

54.ఆ.వె:పతిగ కోరె వేదవతియు నిన్నానాడు
              మాట యొసగె తాను మహిని సీత
                పదుమవతియె వేదవతియని యెరిగిన
                     శేషగిరి నివాస శ్రీనివాస.

55.ఆ.వె:వరహమూర్తి చెంత వసుధను వేడుచు
                వెంకట గిరిపైన వెలసినావు
                 మాత యయ్యె వకుళ మాతయే నీకట
                       శేషగిరి నివాస శ్రీనివాస.

56.ఆ.వె: ఆ.వె:ధరణి నేలు దేవ దర్శింప వచ్చితి
        వేగ కావు మయ్య వెంకటేశ.
        దరిశెనంబు నొసగి దయచూపు మోదేవ
            శేషశైల వాస శ్రీని వాస

Sunday, April 15, 2018

SENDING

డా.బల్లూరి ఉమాదేవి
15/4/18.
తే.గీ:ఉల్లిపాయల తోనోటి నూర జేసి
పటమునందునచూపంగ వాసియౌనె
లొట్ట లేసుకు తినుచున్న
 పట్టుదలగ
దాని రుచిచెప్ప తరమౌనె ధరణి యందు.

తే.గీ:ఉల్లి పాయలను తరిగి యుప్పు కార
మేసి జీలకర్రను చేర్చి యింగు వేసి
గరిటె డు సెనగ పిండిని కలిపి బాణ
లందు నూనేసి వేడెక్క నందులోన
పిండి వేయ వేడిపకోడి బహుళ రుచియు.

Wednesday, November 1, 2017

దైవ చింతన.

అంశం:దైవచింతన

ఆ.వె:దైవచింతనమ్ము తప్పక చేయంగ
       సుఖము లెపుడు కల్గు శుభము గాను
        నిహపరముల యందు నింపును కలిగించు
          ధ్యానమసలు విడకు ధరణి యందు.

ఆ.వెకష్టములవి మదికి కలత బెట్టుచు నున్న
      క్రుంగి పోక సతము కూర్మితోడ
      కృష్ణమూర్తి దలచి ఖిలముకానటువంటి
      దివ్య సంప దందె ద్విజుడు తాను.

ఆ.వె:దైవమందు భక్తి ధరలోన చూపుచు
       చింతనమ్ము సతము చేయుచుండ
       శాంతి కల్గు మదికి సహనగుణము హెచ్చు
       కొలువుమయ్య హరిని కూర్మి తోడ.

ఆ.వె:ధ్యానము నొన రించ తప్పక శ్రీహరి
        కరుణచూపు చుండు ఘనము గాను
        నవవిధభకుతులను నరసిచూడగనందు
         ధ్యానమొకటంచు నరయుడయ్య.


ఆ.వె:హరుని భజన చేయ హర్షమ్ము కలుగును
      జాగు చేయకుండ జపము చేయ
     త్వరితగతిన జరుగు తలచినట్టి పనులు
    జగతి యందు కలుగు జయము నిజము
   

Tuesday, October 31, 2017

డా.A P J కలాం శ్రద్ధాంజలి

డా.A P J కలాం శ్రద్ధాంజలి.


"ఎ"రుక గలవారికీతడు దైవంబు
"
పి"ల్లలచే పెద్దలచే జనులందరిచే
"
జే"జేలు పల్కించుకొన్న ఆరాధ్య మూర్తి
"
అ"లుపెరుంగని నేత ;శత శతా
"
బ్దు"లు దాటినా మరువలేని మహనీయుడు కల
"
లు" కనమనితెల్పి అంతటితో నాగక 
"
క "లలను సాకారమొనర్చు కొనంగ 
"
లా"లిత్యము తోడప్రోత్సహించిన భరత మాత
"
ము"ద్దుబిడ్డ డితడు అందరము సవినయము
"
గా "నర్పింతుము రండు మిత్రులార వా
"
రి "నిండిన నేత్రములతోడ గద్గద స్వరమున వీరి
"
కి" శ్రద్ధాంజలి ఘటింతుమిచట.


అశ్రునివాళి:
మనదేశ ప్రథమ పౌరుడుగా నుండి వేలాది మందికి స్ఫూర్తి ప్రదాతగా నిల్చిన మహామనీషి భారతరత్న డా.APJకలాం గారు కీర్తిశేషులవడం బాధాకరమైన విషయం.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అమెరికాలోమేమున్న ఈ డల్లాస్ నగరంలో వున్న గాంధీ పార్క్ లోఈరోజు 27/7/15 రాత్ర 8 30 ప్రాంతంలో TV 5 మరియు తెలుగు అసోసియేషన్ వారు శ్రీ కలాం గారికి సంతాపసభ యేర్పాటు చేశారు.ఆ సభలో వారిని గూర్చి మాట్లాడే అవకాశం కల్గింది.వారిని గూర్చి నేను వ్రాసిన పద్యాలు వన్పించిన సంగతులు మిత్రలతో పంచుకోవాలని---------
ఆ.వె: భరతమాత గన్నభాగ్యవంతుడితడు
సాటి లేని మేటి శాస్త్ర వేత్త
విద్య పంచి నట్టి విఙ్ఞాన మూర్తిగా
యితని పొగడ తరమె యేరి కైన.
2.ఆవె: నింగి కెగసి నాడు నేడొక్క ధీశాలి 
కదలి సాగి నాడు ఘనత తోడ
స్వర్గ మందు పంచ శాస్త్ర విఙ్ఞానమ్ము
యరగినాడు వేగ నమర పురికి.
3.
ఆ.వె:.అంతరిక్షమందు నపురూపముగ వెల్గ
సాగినాడు గాదె సాధు శీలి
ఒదిగి వున్న కొద్ది ఎదుగు ననెడి రీతి
స్ఫూర్తి దాత యైన సూరి యితడు.
4.
ఆ.వె: భరత జాతి నోము ఫలమె యీధీశాలి
అలుపెరుగని యట్టి యమృత మూర్తి
విద్య నేర్వ మంచు విద్యార్థులకు దెల్పి
వారి మధ్య లోనె బాసె నసువు.

ప్రకృతి.

మిత్రులందరికీ శుభోదయం

శీర్షిక:ప్రకృతి.

ఆ.వె:పాడిపంటలున్న పల్లెటూళ్ళెల్లను
          పలకరించు జనుల పరవశాన
         ఇరుగు పొరుగు తోడ నింపైన ముచ్చట్లు
        ముదము కూర్చు చుండు మదికి నెపుడు.

ఆ.వె:అన్ని ఋతువు లందు నానందమొసగంగ
         చెలమ లోని నీరు సేద తీర్చ
         పిల్ల గాలి మదికి ప్రీతిని కూర్చగా
          ప్రకృతి కోరు జనుల బాగు సతము.

ఆ.వె:గగన మందు శశియు కనువిందు చేయంగ
        తారలెల్ల మురిసి తళుకు లీన
        సంతసాన ప్రకృతి సంబరమ్మును కూర్చ
         హితము కలుగు గాదె నిలను జూడ.

ఆ.వె:పచ్చనైన చెట్లు ఫలముల నివ్వంగ
        చల్లగాలి మదికి చలువ గూర్చ
        ప్రకృతి యెల్ల హాయి పంచుచు నుండంగ
         అంతు లేని హర్ష మావరించు.

ఆ.వె:తరణి కిరణముగని తామరలు విరియు
        గగనమున శశిఁ గని కలువ విరియు
         తరువు లొసగు చుండు ధరలోన ఫలములు
         పరవశింప చేయు ప్రకృతి యెపుడు.

గాంధీజీ,శాస్త్రీజీల జన్మదినం.

అంశం:గాంధీజీ,శాస్త్రీజీల జన్మదినం.

వారిరువురికి జేజేలు పలుకుతూ
 గాంధీజీ
ఆ.వె:పోరు బందరందు పుత్లిబాయికితడు
     పుత్రుడై జనించె పుడమి యందు
     జగతి మెచ్చు నట్టి జననేత తానయ్యె
     సన్నుతించ బడియె జాతిపితగ.

ఆ.వె:మొక్కవోని దీక్ష ముదమున చేపట్టి
      ముష్కర మ్ము నడిపె ముందు నిలిచి
     సత్యవాక్యమునకు చాలప్రాధాన్యత
     నిచ్చి యాచరించె నిలను తాను.

ఆ.వె:భరత మాత యొక్కబానిస సంకెళ్ళు
       త్రెంచ నెంచి తాను తీవ్రముగను
      కృషిని చేసి కారగృహము కేగిన యట్టి
     దిట్ట యితడు గనుడు దేశప్రేమి.
 
ఆ.వె:భరతజాతియొక్క బానిసత్వము బాప
        నవని యందు తాను నవతరించె 
        తెల్ల దొరల తోడ తెలివితో పోరాడి
        వెలుగు బాట చూపి విజయు డయ్యె.

ఆ.వె: శాంతి శాంతి యనుచు శాంతిమంత్రము తోడ
        జయము గల్గ చేసె జాతి కితడు
       సకల జనులు మెచ్చ జాతికి పితయయ్యె
       కొత్త దారి చూపె కువలయాన.,

శాస్త్రీజీ.

ఆ.వె:పంతులింటి యందు ప్రభవించె నీతడు
       పేదరికములోనె విద్య నేర్చె
        బాల్యమందె తండ్రి పరమపదింపగా
        తాతగారి యింట తాను పెరిగె.

ఆ.వె:మచ్చలేని నేత మహిలోన నీశాస్త్రి
       ప్రజల సొమ్ము తాక వలదటంచు
        హితవు తాను తెలిపె నింపుగా  జనులకు
        నాచరించి చూపె ననవరతము.

ఆ.వె:జాతి సతము తలచు జననేత శాస్త్రీజి
       మరువబోకు మెపుడు మహిని నీవు
        నీతి నియమములకు నేస్తమీతడటన్న
     నతిశయోక్తి కాద  నరయుడయ్య .

ఆ.వె:శాంతి ముఖ్యమనెడిసందేశ మొసగుచు
         దేశనేత యైన ధీరు డితడు
          పొట్టి వాడ యినను గట్టి వాడు యనెడి
          మెప్పు బడసినట్టి గొప్పనేత.                                             

ఆ.వె: జైకిసానటంచు జగతిలో రైతన్న
           గొప్పచాటె నెంతొ కూర్మి తోడ
            ఆత్మబంధువయ్యె నన్నదాతలకెల్ల
            కోటికొక్కరుంద్రు కువలయమున.                                       



ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్ వీడుచు
          నమరు లైరి వీర   లవని యందు
           వారు నడచి నట్టి బాట ననుసరించ
             వడిగ రండు మీరు  యడుగు లేయ.

లక్ష్మి



అంశం:లక్ష్మి 



ఆ.వె:జయము జయము లక్ష్మి జయము నొసగుమమ్మ

          విడువక నిను గొలుతు విష్ణు పత్ని

         కొలుచు వారికీవు కొంగు బంగారమే

             కావుమమ్మ మమ్ము కమలనేత్రి.



      ఆ.వె:  వరము లొసగు నట్టి వార్ధితనయ వీవె

              హరికి సతివి నీవు హరుషమొసగు.

             సతము కొలుతు మమ్మశర్వాణి,శ్రీలక్ష్మి

             చల్లగ మము కావు జగతియందు.

 


  ఆ.వె: సిరుల నొసగు తల్లి శ్రీదేవి నిను గొల్తు

           కోర్కె దీర్చ వమ్మ కూర్మి తోడ

             వరము లొసగు నట్టి వరలక్ష్మివే నీవు

                 వెతలు దీర్చి మాకు వేడ్క నొసగు.


ఆ.వె: శుక్రవారమందు సుదతులెల్ల చేరి

           యాచరింత్రు పూజ లనవరతము

         కరుణ తోడ నమ్మ కామితార్థ మొసగ

        వెల్లి విరియు నింట వింత శోభ.


ఆ.వె:సకల శుభము లొసగు సాగరతనయను

          సుదతు లెల్ల జేరి సూక్త రీతి

           కరుణ జూపు మంచు గానము చేయుచు

             కోరి వ్రతము చేయ కోర్కె దీరు.


కం:అమ్మా భార్గవిజననీ

     కొమ్మా పూజల సతతము కూరిమి తోడన్

      యిమ్ముగ నిన్నే గొల్చెద

      నమ్మాధవు తోడగూడి యభయమ్మిమ్మా.


ఆ.వె:పాలకడలి యందు ప్రభవించినావమ్మ

       నాలివైతివి గద హరికి నీవు

       సురలు మెచ్చ చుండ సుమమాల శ్రీహరి

       గళము నందిడితివి కమల నేత్రి


ఆ.వె:హరికి సతివినీవు నభయప్రదాతవు

       కొలుచు వారి మదిని కొలువు దీరి

      యుందువమ్మ మాత యొప్పుగా సతతము

      నిరుత మిలను జూపు నీదు కరుణ.