అంశం:గాంధీజీ,శాస్త్రీజీల జన్మదినం.
వారిరువురికి జేజేలు పలుకుతూ
గాంధీజీ
ఆ.వె:పోరు బందరందు పుత్లిబాయికితడు
పుత్రుడై జనించె పుడమి యందు
జగతి మెచ్చు నట్టి జననేత తానయ్యె
సన్నుతించ బడియె జాతిపితగ.
ఆ.వె:మొక్కవోని దీక్ష ముదమున చేపట్టి
ముష్కర మ్ము నడిపె ముందు నిలిచి
సత్యవాక్యమునకు చాలప్రాధాన్యత
నిచ్చి యాచరించె నిలను తాను.
ఆ.వె:భరత మాత యొక్కబానిస సంకెళ్ళు
త్రెంచ నెంచి తాను తీవ్రముగను
కృషిని చేసి కారగృహము కేగిన యట్టి
దిట్ట యితడు గనుడు దేశప్రేమి.
ఆ.వె:భరతజాతియొక్క బానిసత్వము బాప
నవని యందు తాను నవతరించె
తెల్ల దొరల తోడ తెలివితో పోరాడి
వెలుగు బాట చూపి విజయు డయ్యె.
ఆ.వె: శాంతి శాంతి యనుచు శాంతిమంత్రము తోడ
జయము గల్గ చేసె జాతి కితడు
సకల జనులు మెచ్చ జాతికి పితయయ్యె
కొత్త దారి చూపె కువలయాన.,
శాస్త్రీజీ.
ఆ.వె:పంతులింటి యందు ప్రభవించె నీతడు
పేదరికములోనె విద్య నేర్చె
బాల్యమందె తండ్రి పరమపదింపగా
తాతగారి యింట తాను పెరిగె.
ఆ.వె:మచ్చలేని నేత మహిలోన నీశాస్త్రి
ప్రజల సొమ్ము తాక వలదటంచు
హితవు తాను తెలిపె నింపుగా జనులకు
నాచరించి చూపె ననవరతము.
ఆ.వె:జాతి సతము తలచు జననేత శాస్త్రీజి
మరువబోకు మెపుడు మహిని నీవు
నీతి నియమములకు నేస్తమీతడటన్న
నతిశయోక్తి కాద నరయుడయ్య .
ఆ.వె:శాంతి ముఖ్యమనెడిసందేశ మొసగుచు
దేశనేత యైన ధీరు డితడు
పొట్టి వాడ యినను గట్టి వాడు యనెడి
మెప్పు బడసినట్టి గొప్పనేత.
ఆ.వె: జైకిసానటంచు జగతిలో రైతన్న
గొప్పచాటె నెంతొ కూర్మి తోడ
ఆత్మబంధువయ్యె నన్నదాతలకెల్ల
కోటికొక్కరుంద్రు కువలయమున.
ఆ.వె:భరత జాతి కొరకు ప్రాణముల్ వీడుచు
నమరు లైరి వీర లవని యందు
వారు నడచి నట్టి బాట ననుసరించ
వడిగ రండు మీరు యడుగు లేయ.
No comments:
Post a Comment