అంశం: దేశసేవలో సైనికులపాత్ర
ఆ.వె:దేశ సేవ మిన్న దేహరక్షణ కన్న
యనుచు సాగినారు నవనియందు
వారి త్యాగఫలమె వసుధలో నీ స్వేచ్ఛ
జోతలిడగ రండు సుజను లార.
ఆ.వె:అశన వసనములను నాదిలో విడనాడి
భరతజాతి కొరకు ప్రాణములను
నొసగ సిద్ధపడిన యోధానుయోధుల
కిడగ వందనాలు వడిగ రండు.
ఆ.వె:మనువు మగువ కన్న మాతృభూమియె మిన్న
యనుచు సైనికుండు నలుపు లేక
పగలు రేయి యనక ప్రాణముల్ పణముగా
పెట్టి కాచుచుండు పృథ్వి యందు.
ఆ.వె:ఎముకలు కొరికేటి హేమంత మందైన
మండుటెండనైన మహిన చూడ
సైనికుండు గొప్ప స్థైర్యమున్ బూనుచు
సాగుచుండు నతడు జడుపు లేక.
ఆ.వె:నిశిత దృష్టితోడ నిర్జించ శత్రులన్
శ్రద్ధతోడ సతము సమరమందు
పాటుపడుచు నుండి ధాటిగా పోరుచు
నుండు సైనికుండు నుర్వి యందు.
ఆ.వె:ఉగ్రవాదు లెల్ల నుర్వినాశమొనర్ప
నడుము కట్టి తాము నడచుచుండ
రక్షకభటులు గని రౌద్రరూపము తోడ
వారి నణచి వేసి వీరులైరి.
తే.గీ:తల్లి దండ్రుల నెడబాసి తాళి కట్టి
నట్టి యాలిని విడనాడి నరిగి నావు
కాదె నవని యందున నీవు ఘనత యన్న
నీదె ఘనచరితుడవీవె నిజముగాను.
No comments:
Post a Comment